పుట:AndhraKavulaCharitamuVol2.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పతులకిచ్చెను. కాని కృష్ణదేవరాయల మరణానంతరమున కుతుబ్ షా కొండపల్లివద్ద జరిగిన యుద్ధములో హిందువుల నోడించి కృష్ణా గోదావరీ మధ్యరాష్ట్రమునంతను నాక్రమించుకొనెను. ఈయంశము నే పూర్వోక్తగ్రంథములోని


"కట కేశ్వరుని దోలి కైవసంబుగకేసె

గొండంతజయముతో గొండపల్లి."


అను సీసపాదము చెప్పుచున్నది.కుతుబ్ షాయొక్క యనంతరమునందాతని ద్వితీయపుత్రుడైన జామ్‌షీదు రాజ్యమునకు వచ్చి క్రీస్తుశకము 1543 వ సంవత్సరము మొదలుకొని 1550 వ సంవత్సరము వఱకును రాజ్యముచేసెను. ఇతడు మహాక్రూరుడు, రాజ్యాశచేత తనయన్నగారి నేత్రములను తీయించి వేసి యాతని నంధునిగా జేసిన పాపాత్ముడు. ఈతని దుష్టస్వభావము నెఱిగి భయపడి పాఱిపోయి యిభరామ్‌షా తనయన్నగారి మరణమువఱకును విజయనగరమునందు కృష్ణదేవరాయని యల్లుడైన రామరాజుయొక్క సంరక్షణమునందుండెను. ఇతడక్కడనున్న కాలములోనే రామరాజభూషణుడు మొదలయిన కవులతోడి సహవాసముచేత సంస్కృతాంధ్ర సాహిత్యమును సంపాదించి, కవిత్వమునం దభిరుచిగలవాడయి క్రీస్తుశకము 1550 వ సంవత్సరమునందు తాను రాజ్యమునకు వచ్చినది మొదలుకొని యాంధ్రకవుల నాదరించి పెక్కుకృతుల నొందెను. ఇతడు తన రాజ్యకాలములో హిందువులతో మైత్రిగలవాడయి హిందూరాజులను వారివారి కవీశ్వరుల తోడ గూడ తన యాస్థానమునకు బిలిపించి తఱచుగా పండితగోష్ఠిని కాలము గడుపుచువచ్చెను. ఈతడొక్కసారి తన యాస్థానమునకు పెమ్మసాని తిమ్మనాయనిని, అనంతపురపు హండెయప్పయను, మట్ల అనంతరాజును, బంగారేచమనాయనిని, పేరమల్లారెడ్డిని, పిలిపించి వారివారి కవీశ్వరులు వారివారిని స్తుతించిన పద్యములను వినుచుండగా కాపువా