పుట:AndhraKavulaCharitamuVol2.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ పట్టిక యొక్కటియే చాలవఱకు శిలాతామ్రశాసనములలోని కాలము ననుసరించి యున్నది.

కృష్ణదేవరాయలు జన్మించిన దినముగాని సంవత్సరముగాని సరిగా దెలియదు. కృష్ణరాయలజనన మొకరు 1465 వ సంవత్సరమునందనియు, ఇంకొకరు 1487 వ సంవత్సరమునందనియు వ్రాసియున్నారు. గాని యందేది సత్యమయినదియు నిశ్చయించుట కాధారము లేవియు దొరకలేదు. ఇతడు శాలివాహనశకము 1387 వ సంవత్సరమునందనగా క్రీస్తుశకము 1465 వికృతిసంవత్సర పుష్యబహుళ ద్వాదశీ శుక్రవారమునాడు పుట్టినట్టు తెలిపెడి యీక్రిందపద్య మొకటి వాడుకలో నున్నది:-

ఉ. అందలి శాలివాహనశతాబ్దము లద్రివసుత్రిసోములన్

వందిత మైనయవ్వికృతివత్సర మందలి పుష్యమాసమం

దుం దగుకృష్ణపక్షమున నుండెడిద్వాదశి శుక్రవాసరం

బం దుదయించె గృష్ణుడు శుభాన్వితు డానరసింహమూర్తికిన్.

ఇది యంతవఱకు విశ్వసింపదగినదో బుద్ధిమంతులగువా రాలోచించుకొందురుగాక! అయినను, ఇది మొదటివారు చెప్పినకాలముతో సరిపోవుచున్నందున దీని నధికవిశ్వాసార్హముగా నెంచవచ్చును. 1829 వ సంవత్సరములో కావలి వెంకటరామస్వామిగారు కలకత్తానగరమునందు బ్రచురించిన దక్షిణహిందూదేశకవుల చరిత్రములో కృష్ణరాయలు తన నలువదవయేట శాలివాహనశకాబ్దములు 1446 వ సంవత్సరమునందనగా క్రీస్తుశకము 1524 వ సంవత్సరమునందు మృతినొందినట్టి వ్రాసియున్నారు. దీనిని బట్టిచూడగా నీ రాయలవారు హూణశకము 1484 వ సంవత్సరమున బుట్టిన ట్టేర్పడుచున్నది. అల్లసాని పెద్దన్న చెప్పినట్టు చాటుధారగా వచ్చుచున్న యీక్రింది పద్యములనుబట్టికూడ కృష్ణదేవరాయల మృతికాల మించుమించుగా దీనితో సరిపోవుచున్నది.