పుట:AndhraKavulaCharitamuVol2.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. వడిగలతనాన నీగిని

విడిముడిపస బ్రాభవమున విజయనగరిలో

గడునెన్న నేర్వగల మేల్

నడకల బెదవేంకటాద్రి నరవరు డొప్పున్.


ఈ పద్యమునుబట్టి విజయనగరరాజ్యము చెడకముం దనగా 1564 వ సంవత్సరమునకు బూర్వమే రాఘవపాండవీయము రచియింపబడిన దగుట నిశ్చయము.

కృష్ణదేవరాయని కాలములోనున్న ధూర్జటికవియొక్క మనుమడయిన కుమారధూర్జటి కృష్ణరాజవిజయమును రచించెను. అతడు కృష్ణరాజవిజయములోని యీ రెండవపద్యమునందు,


సీ. జగదధిష్ఠానభాస్వజ్జ్యోతి యగువాడు

బ్రహ్మాదులదరు దురాయివాడు

చలిగట్టురాపట్టి సామేన గలవాడు

చిఱునవ్వువెన్నెలల్ చిలుకువాడు

వాడువీడనక యెవ్వనినైన బ్రోచువా

డఖిలదై వతగురుం డైనవాడు

లీలమై శూలంబు కేల బూనినవాడు

నలమేనిదొరతూపు గలుగువాడు

కలితపంపాతటంబున నిలుచువాడు

శ్రీవిరూపాక్షశివుడు రక్షించునెప్పు

డఖిలసద్గుణమణిపేటి యాకువీటి

చిన్న వేంకటరాయని చెలువుమీఱ.


అని వర్ణించిన యీ చినవేంకటరాయడు రాఘవపాండవీయములో వర్ణింపబడిన కృతిపతి తమ్ముడయిన చినవేంకటాద్రియే యయినపక్షమున, ఈ పద్యమును పయికాలమును స్థిర పఱుచుచున్నది.