పుట:AndhraKavulaCharitamuVol2.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజు, తిమ్మరాజు, రామరాజు, తిరుమలరాజు, వేంకటరాజూ అని యైదుగురు కొడుకులు. వీరిలో మూడవవాడైన రామరాజూ కృష్ణదేవరాయల యల్లుడు. ఈ రామరాజువద్దనే వసు చరిత్రమును రచించిన రామరాజుభూషణుడు మొదట ఆస్థానకవీశ్వరుడుగానుండి యాతని మరణానంతర మతని తమ్ముడైన తిరుమలదేవరాయనికి వసు చరిత్రము నంకితము చేసెను. దీనినిబట్టి చూడగా శ్రీరంగరాయని పుత్రులైన రామరాజు తిరుమలదేవరాజులును, తిమ్మరాజుపుత్రుడైన తిరుమలరాజును పినతండ్రి పెదతండ్రి పుత్రు లగుటచేత సమకాలికులని యేర్పడు చున్నది. వీరిలో రామరాజు క్రీస్తుశకము 1542 వ సంవత్సరము మొదలుకొని 1564 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసి యా సంవత్సరమునందు తాలికోటయుద్ధములో మృతుడగుటచేతను, అతనితమ్ముడైన తిరుమలదేవరాయలు 1564 వ సంవత్సరము మొదలుకొని 1573 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసియుండుటచేతను, బాల భాగవతమును చేయించిన తురుమలరాజుసహిత మించు మించుగా 1550 వ సంవత్సరప్రాంతమునం దనగా పదునాఱవశతాబ్ద మధ్యమునందుండియున్నా డనుట స్పష్టము, కడపమండలములోని కడప పట్టణమునుకు పశ్చిమోత్తర దిగ్భాగమునందు 16 మైళ్ళ దూరములోనున్న యెఱ్ఱగుడిపాడు గ్రామములోని విష్ణ్వాలయములోని శాలివాహనశకము 1473 వ సంవత్సరమునం దనగా హూణశకము 1551 వ సంవత్సరమునందు తిమ్మరాజు కుమారుడయిన తిరుమలరాజు దానము చేసినట్టున్న శిలాశాసనముకూడ ఈ యంశమును స్థాపించుచున్నది, అయినను బళ్ళారిమండలములోని విజయనగరమునందలి హజారరాముని దేవాలయములో ముఖద్వారముయొక్క దక్షిణపు గోడమీద తిమ్మరాజు కుమారు డయిన తిర్మలరాజు శాలివాహనశకము 1442 వ సంవత్సరమునందు దానముచేసినట్టు శిలాశాసన మొకటి కానబడుచున్నది.