పుట:AndhraKavulaCharitamuVol2.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాంతమునందు రచియింపబడి యుండును. ఈ కవియు 1560 - 70 సంవత్సరముల వఱకు జీవించియుండునని యూహింపదగియున్నది. ఈతని కవిత్వము మృదుమధుర వాక్యరచనాధురీణమయి కర్ణరసాయనముగా నుండును. ఈతని కవనధోరణిని దెలుపుటకు గృష్ణరాయ విజయములోని రెండుమూడు పద్యము లిందుదహరింపబడుచున్నవి-


ఉ. ఠీవిగ నౌకువారును గడిందిరహిన్ వెలుగోటివార లా

రావెలవారు గూడుకొని రాత్రిపగల్ చతురంగసేనతో

నేవగ జూచినన్ దివియ నెంతయు శక్యముగాని దుర్గమా

భూవరమౌళి కాంచి యొకపూటనె తీసెదనంచు నుగ్రుడై.


శా. ఔరా చూచితిగాదె రాయలబలం జౌరౌర యేనుంగు ల

య్యారే యీచతురంగసంఘము లహాహా మన్నెవారల్ బళీ

ధీరుల్ రాజకుమారు లంచు మది నెంతేనద్భుతం బొందుచున్

బోరన్ శక్యమె యీనృపాలమణితో భూరిస్థిరప్రౌడిమన్- [ఆ.3]


మ. చెలువల్ తోడ్కొనిరా మణీఖచితమంజీరధ్వను ల్మించగా

దళుకుంజెక్కు మెఱుంగుటద్దములపై దాటంకరత్నద్యుతుల్

వెలయం దా గజరాజపుత్రి యగుఠీవిం దెల్పుచందాన వ

చ్చె లతాంగీమణి మందమందగతులన్ శృంగార ముప్సొంగగన్- [ఆ.4]

                            ________