పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేదాంతము, జ్యోతిషము నిరూపింపఁబడెను. రెండవ భాగమును సూరన తెనిఁగింపలేదు. పూర్వభాగము విష్ణుప్రభావాదికములు, శ్రీకృష్ణజీవితము తెలుపుచిత్రకథలు కలది గావుననే యిక్కవి వలయుచోటులఁ బెంచియుఁ గుదించియు నాంధ్రీకరణమునఁ గ్రొత్తత్రోవలు దీసి యొక్కచక్కనికావ్యగ్రంథముగాఁ దెనిఁగించినాఁడు. సంస్కృతముననున్న విష్ణుపురాణమునకుఁ జరిత్రదృష్టితోఁ జూచినను గొప్పవిలువ గలదు. పురాణములన్నియు వ్యాసకల్పితములు గావను పాశ్చాత్యనాగరకులు సైతము భారతముతోబాటు దాదాపుగా విష్ణుపురాణముగూడఁ బూర్వతరమని విశ్వసించుచున్నారు. పురాణలక్షణములని చెప్పఁబడు,

శ్లో.

“సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశమన్వంతరాణిచ
వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణమ్"

అను నైదులక్షణములు విష్ణుపురాణమున సక్రమముగా సరిపడియున్నవి. అన్నివిధముల గణనీయమని పేగొంది. సాత్త్వికపురాణరాజములలో నొకటి యని ప్రసిద్దిగాంచినయీవిష్ణుపురాణమును సరసముగాఁ దెనిఁగించి యాంధ్రలోకమునకుఁ బ్రసాదించిన వెన్నెలకంటి సూరనార్యుఁడు ఆంధ్రలోకమునకుఁ బ్రశంసాపాత్రుడు. విష్ణుపురాణప్రశస్తి నీక్రిందివిధముగా సూరనార్యుఁడు బేర్కొనినాఁడు.

సీ.

“వేదంబులకు నెల్ల వేదంబు ధర్మశాస్త్రంబులలోపల ధర్మశాస్త్ర
మాగమార్థములలో నాగమార్థం బగు జ్యోతిషంబులలోన జ్యోతిషంబు
బహుపురాణములలోపల పురాణం బితిహాసంబులం దితిహాస మఖల
నీతిశాస్త్రములలో నీతిశాస్త్రము మహాయోగవిద్యలలోన యోగవిద్య


తే.

కావ్యములలోనఁ గావ్యంబు భవ్యతరము, సకలలోకైకవేద్యంబు సకలసుకవి
చిత్తరంజనకారణం బుత్తమంబు, క్షోణి నొప్పారు విష్ణుపురాణ మనఘ.”

భాగవతమునందుఁ బేర్కొనఁబడిన విష్ణుభక్తులకథలలోఁ జాలభాగ మిందుఁ గలవు. శ్రీకృష్ణావతారఘట్టము హరివంశమునందును భాగవతమునందును విష్ణుపురాణమునందును గలదు గాని కథాభాగములలోఁ గొంచెము వ్యత్యాసము గలదు. చారిత్రకదృష్టితో నరయువారు విష్ణుపురాణమునుండి శ్రీకృష్ణునిజీవితరహస్యములు గ్రహించుచున్నారు. సకలపురాణసారభూతము పవిత్రతరమునగు నీవిష్ణుపురాణమునందలి యుత్తరభాగము కవితాకళ కంతగా సంబంధించినది కాదని కాఁబోలును సూరనార్యుఁడు తెలిఁగింపక విడిచినది!