పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సకలభోగాస్పదసంపత్కరములందుఁ గౌరవాధీశ్వరుకంటె మేలు


తే.

గురుతరస్ఫారధీరతాగుణములందుఁ, గనకధరణీధరేంద్రునికంటె మేలు
చటులకుటిలవిరోధిరాజస్యశైల, లేఖవిభుఁ డైనతమ్మయలింగఘనుఁడు.[1]

47


క.

ఘనుఁ డగుతమ్మయలింగన, వినుతజ్ఞానమున నీగి విభవమునందున్
జనకునిఁ బయోధికన్యా, జనకుని మఱి పుష్పబాణజనకునిఁ బోలున్.[2]

48


క.

వీరల కెల్లను గులగురుఁ , డై రాజులపూజలింగమై సుఖవిమనః
పూరితఘనవితరణవి, ద్యారసికుఁడు పంగులూరియన్నయ వెలసెన్.[3]

49


సీ.

వినుతనానావేదవేదాంగశాస్త్రపురాణేతిహాసనిర్వాహకుండు
శైవవైష్ణవసౌరశాక్తగాణాపత్యమంత్రతంత్రాగమమర్మవిదుఁడు
పరమపావనపరాపశ్యంతిమధ్యమావైఖరిమార్గప్రవర్తకుండు
ఆధారమణిపూరకాదిపంకజపత్రనిక్షిప్తపంచదశాక్షరుండు


తే.

కావ్యనాటకాలంకారభవ్యమూర్తి, పరమగురుసంప్రదాయప్రభావనిరతుఁ
డగుచు ఘోడియరాయవిఖ్యాతి నొందెఁ, బంగులూరన్నయార్యుండు బ్రహ్మవిదుఁడు.[4]

50


ఆ.

అట్టిపంగులూరియన్నయాచార్యుని, కరుణ వడసి సిరులఁ గాంచి మించె
రసికశేఖరుండు రావూరితమ్మయ, బసవభూవిభుండు వసుధయందు.

51


వ.

అతని కాంతారత్నంబు.

52


ఆ.

ఘనత నశ్వదానగజదానదీక్షాగు, రుండు నాఁగ నవని రూఢి కెక్కి
నట్టిమేటితాత యల్లూరియనమార, విభుఁడు పాకనాట విస్తరిల్లె.

53


క.

ఆయన మారనపుత్రుఁడు, పాయనిపౌరుషము యశము భాగ్యము విభవ
శ్రీయును గలపెమ్మమహీ, నాయకరత్నంబు పాకనాటను వెలసెన్.

54


వ.

అతనికుమారులు.

55


సీ.

నానాజన ప్రమోదానూనపంచపర్వాన్నదానవినోది యన్నఘనుఁడు
కంటకాచలపక్షలుంటాకనాకాధివాసవల్లభుఁ డైనవల్లభుండు

  1. కమలాప్తసూనుఁడు = కర్ణుఁడు, కమ్మపూవిలుకాఁడు = మన్మథుఁడు, కౌరవాధీశ్వరుఁడు = దుర్యోధనుఁడు, కనకధరణీధరేంద్రుఁడు- పర్వతరాజుగు మేరువు, లేఖవిభ్యుడు = ఇంద్రుఁడు.
  2. వినుతజ్ఞానమునన్ = పొగడఁబడిన తెలివియందును, ఈగిన్ = దాతృత్వమునందును, పయోధికన్యాజనకుని = సముద్రుని.
  3. సుకవిమనఃపూరితఘనవితరణవిద్యారసికుఁడు = సత్కవులయొక్క మనస్సులను నిండించునట్టి (తృప్తినొందించునట్టి) దాతృత్వవిద్యయందు నేర్పరి.
  4. వేదాంగములు = శిక్షావ్యాకరణాదులు, పురాణములు = బ్రాహ్మము మొదలగునవి, ఇతిహాసములు = పూర్వకాలపువృత్తాంతములు, సౌరము = సూర్యునికి పర్వతమును స్థాపించాడుమతము, పరాపశ్యంతి మధ్యమా = (ఇవి యీపేళ్లచే ప్రసిద్ధములైన) శాస్త్రవైఖరులు, పంచదశాక్షరుఁడు = పంచదశాక్షరీవిద్యను నేర్చినవాఁడు, భవ్యమూర్తి = శుభస్వరూపుఁడు.