పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శ్రీవిష్ణుపురాణము

(సటిప్పణము)

పీఠిక



కాంతాకుచహేమకుంభములపైఁ జెల్వారు కాశ్మీర మ
స్తోకంబై తనపేరురంబునఁ గడున్ శోభిల్లి దీప్తిచ్ఛటా
వ్యాకోచంబుగఁ గౌస్తుభంబునకు జోడై యున్న మోదించుసు
శ్లోకుం డబ్బసవేంద్రురాఘవున కిచ్చున్ సుస్థిరైశ్వర్యముల్.[1]

1


ఉ.

సల్లలితాస్యపంచకము శాఖలు చారుజటారుణద్యుతుల్
పల్లవకాంతి చందురుఁడు పక్వఫలంబు శిరోగ్రగంగ సం
ఫుల్లసుమంబు సత్కరుణ పుష్పరసం బగుచున్న పార్వతీ
వల్లభకల్పశాఖి బసవప్రభురాఘవు ధన్యుఁ జేయుతన్.[2]

2


చ.

సరసిజనాభునాభిజలజాతము పుట్టినయిల్లు సత్కవీ
శ్వరులకుఁ బల్కుఁదోడయిన శారద పట్టపుదేవి వేదముల్
పరఁగువినోదవాక్యముల పద్ధతులై కనుపట్టు భారతీ
వరుఁడు శుభంబు లిచ్చు బసవప్రభురాఘవభూమిభర్తకున్.[3]

3


మ.

జననీస్తన్యము గ్రోలుప్రాయమున నుత్సాహంబుతో దేవతా
వనితల్ వేడుకపుట్టఁ దాళగతులన్ వాయించుచుం బాడఁగాఁ
గనదుల్లాసముతోడ బొజ్జ గదలంగా నాడులంబోదరుం
డనురాగంబున రాఘవప్రభుని నిత్యశ్రీయుతుం జేయుతన్.[4]

4
  1. హేమకుంభములు = బంగారు కుండలు, కాశ్మీరము = కుంకుమపువ్వు - కుంకుమపువ్వు చేర్చిన పరిమళచందనమని యర్థము, అస్తోకము = అల్పము కానిది - మిక్కుటము అనుట, పేరురంబునన్ = విశాలమైన ఱొమ్మునందు, దీప్తిచ్ఛటావ్యాకోచంబు = కాంతినమూహముచేత వికాసమునొందినది, సుశ్లోకుఁడు = మంచికీర్తి గలవాఁడు.
  2. అస్యపంచకము = అయిదుముఖములు, ఆరుణద్యుతులు = ఎఱ్ఱనికాంతులు, శిరోగ్రగంగ = తలమీఁదనుండు గంగానది, సంఫుల్లసుమంబు = చక్కఁగా వికసించినపువ్వు, కల్పశాఖ = కల్పవృక్షము
  3. జలజాతము = తామర, శారద = సరస్వతి, పద్ధతి = మార్గము - సరణి, కనుపట్టు = కానఁబడు.
  4. స్తన్యము = చనుఁబాలు, క్రోలు = త్రాగు, లంబోదరుఁడు = వ్రేలుబొజ్జ గలవాఁడు, వినాయకుఁడు, నిత్యశ్రీయుత = శాశ్వతమైన ఐశ్వర్యముతోఁ గూడుకొన్నవానిగా