పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానిని మేము చూడలేదు. తుపాకుల అనంతభూపతి విష్ణుపురాణమును వచనకావ్యముగా వ్రాసెను. అది ముద్రితమైనదటగాని మే మాప్రతిని జూడకుండుటచే నందెంతవఱ కీపద్యకావ్యమునకు సంబంధము గలదో నిశ్చయింపలేకపోతిమి.

సూరనార్యుఁడు కవితారచనమున శ్రీనాథాదిపురాణకవులకు జోడైనవాఁడు. కొన్నియెడల ధారాశుద్ధి పద్యగమనము సమాసకల్పనము మున్నగువాని కీకవిరాజు శ్రీనాథునియెడ లక్ష్యభావ ముంచె ననుటకుఁ దార్కాణలు విష్ణుపురాణమున లేకపోలేదు, చర్చింప మొదలిడినవిషయము విస్తరమగునని విడిచితిమి.

విష్ణుపురాణము చిరకాలము క్రిందట బాజారుప్రతిగ ననేకదోషములతో ముద్రితమై ప్రతులు చెల్లిపోయెను. తదాదిగ నీమహాగ్రంథము ఆంధ్రభాషాప్రియులకు లభించుటయే కష్టమయ్యెను. సులలితముగ నాగ్రంథమును వ్రాతప్రతులతోఁ బోల్చి శుద్ధ ప్రతి వ్రాయించి లఘుటిప్పణముగూడ సమకూర్చి యాంధ్రలోకమునకు సమర్పించిన ఆంధ్రభాషాభిమానులగు బ్రహ్మశ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులుగారి ప్రయత్నము ప్రశంసాపాత్రము. ఈ యుద్గ్రంథము మూలముతోఁ బోల్చి చూపుదమున్న ఎంత ప్రయత్నించినను మూలము లభింపకపోయెను. త్వరగ బీఠిక వలయు నని ప్రకాశకులు సెలవిచ్చుటచే విశ్రాంతిభాగ్యమునకు నోచుకొనకున్నను బరిశ్రమజేసి యెటులనో వ్రాసితిమి. సాహసమునకు క్షంతవ్యులము.

నందిగామ.

ఇట్లు భాషాసేవకులు,

20-8-1928

శేషాద్రిరమణకవులు

శతావధానులు