పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాఁడు. భూదేవి పృథుచక్రవర్తికి వెఱచి పారుటయు సముద్రమథనమును జడభరతచరిత్రమును మనోహరముగా నున్నవి. రామకథయుఁ గృష్ణాదులు బ్రాహ్మణకుమారుల బ్రదికించినకథయు నరకాసురవధయు మిగుల సంక్షేపింపఁబడుటచే నాభాగములలో రసము కొఱఁతపడినది. అవకాశమును బురస్కరించుకొని సూరనార్యుఁడు కవితానైపుణ్యము ప్రదర్శించినతావులు గోన్ని కలవు.

అంత్యనియమము

“మ.

కనియెన్ భాగవతోత్తముండు త్రిజగత్కళ్యాణవర్ధిష్టునిన్
వనజాతాసనవాసవప్రభృతిదేవప్రాభవాధిష్ణునిన్
ఘనగర్వాంధనిశాచరేంద్రవరభాగ్యప్రక్రియాజిష్ణునిన్
కనదంభోధరకృష్ణునిన్ సుజనరక్షాతృష్ణునిన్ గృష్ణునిన్."

(ఆ.7 ప.335)

ఉత్ప్రేక్షాలంకారము

"చ.

పడమటివంకఁ గ్రుంక నురుభాస్కరబింబము తూర్చుకొండపైఁ
బొడిచిన చంద్రమండలముఁ బొల్పెసలారెఁ బయోజసంభవుం
డెడపక రాశి మానగతు లెక్కువ తక్కువ లైనకాలముల్
తడఁబడు నంచుఁ దూఁచు నెడఁ ద్రాసునఁ దేలెడుచిప్పలో యనన్.”

(ఆ.7 ప.333)

అచ్చతెనుఁగుఁగూర్పులు

"క.

పచ్చనికసవులు పసులను, విచ్చలవిడి మేయదోలి వేడుకతోఁ గ
నిచ్చకు వచ్చిన యచ్చట, మెచ్చులతాళములలోన మెలఁగుచు నున్నన్.”

(ఆ. 7 ప.192)

విష్ణుపురాణమును ఈసూరనార్యుఁడెగాక పశుపతిపుత్రుఁ డగునాగనాథుఁ డనుకవియు క్రీ.శ. 1380 ప్రాంతమునఁ దెనిఁగించినాఁడు. ఇతఁడు ప్రౌఢకవి యని యాతనిశాసనశ్లోకములును విష్ణుపురాణములోనిదని ప్రబంధరత్నావళిలో నుదాహరింపఁబడిన యీక్రిందిపద్యమువలనను తెలియవచ్చును.

"ఉ.

మాసరమయ్యె నంత మధుమాసము పాంథవిలాసినీజన
త్రాసము పుష్పబాణనవరాజ్యవితానము వల్లరీవధూ
హాసము మత్తకోకిల సమంచితపంచమనాదమంజిమ
వ్యాసము జీవలోకహృదయంగమసౌఖ్యవికాస మెంతయున్."

ఇంతవఱ కీగ్రంథరాజము లభింపకపోవుట సంతాపకరము, ఆధునికుఁ డగు సీతారామసిద్ధాంతికవిగూడ విష్ణుపురాణమును బద్యకావ్యముగఁ దెనిఁగించెనట గాని