పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యించువారి కీభేదములు ముఖ్యముగాఁ బరిగణనీయములు. కథాభాగములందలి యాయాభేదములకతన సంస్కృతవిష్ణుపురాణము ప్రాచీనతరమని సుబోధమగును.

సుధీలోకమున కీకవి విన్నవించుకొనిన ప్రార్థనారూపముగానున్న యీక్రింది

ఉ.

"ఏను పరాశరుండు రచియించిన విష్ణుపురాణ మాంధ్రభా
షానిపుణోక్తులం బలుకఁజాలెదనంచుఁ దలంచినాఁడ శే
షాీనిలభుగ్విభుం డురుసహస్రశిరంబులఁ దాల్చు లోకముల్
హీనపుఁ బూరిపాము ధరియించెద నంచుఁ దలంచు చాడ్పునన్.”

అనుపద్యమును, దానిక్రింద నాల్గుపద్యములును కుకవినింద యొనరింపమియుఁ జూడ సూరనార్యుఁడు సత్త్వగుణప్రధానుఁడనియు విద్యావివాదములలోఁ బాల్గొని జీవితము గడపినవాఁడు కాఁడనియుఁ దోఁచును. విష్ణుపురాణము మొత్తముమీఁద నిర్దుష్టముగా నున్నది. వ్యాకరణదోషములుగఁ బూర్వులచే గణింపఁదగినవి కొన్నితావులలో లేకపోలేదు.

క్వార్థక ఇకారసంధులు

మ. హిమవత్పర్వత కూటసానువులనుం డేతెంచు(ఆ.2 ప.322)

క. ఇయ్యాహారంబులచే, నయ్యా బడలికలు దీరి నాసంతోషం బయ్యున్నదె(ఆ.3 ప.352)

ఇకారసంధులు

మ. బెడఁకుంజూపులు క్లిన్నదంతచయమున్ వెర్ఱాటలున్(ఆ.3 ప.274)

సీ. శైశవక్రీడాప్రసంగముల్ కొన్నేండ్లు కొన్నేండ్లు ముద్దుపల్కులబెడంగు(ఆ.5 ప.187)

ఇటులె యింకఁ గొన్నిస్వల్పలోపములు గలవు. సర్వసుగుణభరితమగు నీయుద్గ్రంథమునఁ గలస్వల్పలోపములు బరిగణనీయములు కావు, మొత్తముమీఁద నీకవిని రౌచికుఁడనియు నుచితజ్ఞుఁడనియు లాక్షణికుఁడనియుఁ జెప్పక తప్పదు. విష్ణుపురాణమున సూరనార్యుఁడు సందర్భానుసారముగా నవరసములకుఁ దావొసంగినాఁడు. ఏరసమునందేని యితరకవుల ననుకరించినటులఁ గానరాదు. దుర్వాసునిశాపము పరశురామకథలో బీభత్సరౌద్రభయానకరసముల యుచ్చస్థితియుఁ బురూరవుఁడు భరతుఁడు లేడికొఱకును ఊర్వశికొఱకును బరితపించుఘట్టమునఁ గరుణరసము. ఇటులె యాయాస్థలములలో నితరరసములు యథాయోగ్యముగఁ బోషించి