పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుమార చినతిమ్మానాయనింగారు పొదిలెస్థలం దేవబ్రాహ్మణులకు.................ఇచ్చిన ధర్మశాసనము.

మొదటిశాసనము క్రీ. శ. 1573 లోను రెండది క్రీ. శ. 1583 లోను నెలకొల్పఁబడినవి. నిర్వాణ రాయడప్ప వెలుగోటి యను నుపనామము సంపాదించినది 1530 ప్రాంతమునందు. వెన్నెలగంటి సూరనార్యుఁడు ఈముగ్గురు వెలుగోటి తిమ్మానాయకులలో రెండవతిమ్మానాయకునికాలమునం దున్నందున నీకవి క్రీ. శ. 1530 మొదలు 1555 లోఁగా నుండియుండెననుట సత్యము. ఈనిర్ణయమువలన బసవరెడ్డి కృష్ణరాయలకాలమునను దరువాతికాలమున నాతనితనయుఁడగు రాఘవరెడ్డియు నుండిరనుట సరిపడును ఇదియె నిర్వివాదమగు నిర్ణయము.[1]

గురుజాడ శ్రీరామమూర్తిగారు విష్ణుపురాణరచనాకాలము క్రీ.శ. 1300 అనిరి. వీరేశలింగము పంతులువారు క్రీ.శ. 1350-1360 అనిరి. లాక్షణికకవులలో నెల్ల ప్రసిద్ధులగు నప్పకవ్యాదులు విష్ణుపురాణమునుండి యుదాహరణములు గైకొనలేదు. ఆళ్లయవీరభద్రుని (కాలము 1426-1440) గూడఁ గూటస్థునిగఁ గృతిపతిఁ జెప్పుకొనినాఁడు. ప్రకృతకవికి అనవేముని మెప్పించిన వెన్నెలకంటి సూర్యుండును కృతిభర్తకు అనవేమారెడ్డి కూటస్థులు. ఆవలితరములు తెలియవు. వీని నన్నింటిని సమన్వయించి చూడ విష్ణుపురాణరచనాకాలము పదునాఱవశతాబ్దాంతమనుట పొసఁగియున్నది. వంశీయుఁ డొసంగిన యాధారము కృతిభర్తతండ్రిని కూర్చిన యాధారములు గూడ సాక్ష్యములైనవి. కృతిభర్తగురువగు తిరుమలతాతాచార్యుని బట్టి కాలనిర్ణయము సేయుట నిరాధారశ్రమ. పదునెనిమిదవ శతాబ్దములోని ముద్దుపళని గురువుగూడ నొకతిరుమలతాతాచార్యులే. ఇంక మధ్యకాలమున నెందఱో కలరు. ఇట్టినిర్ణయముల విమర్శించుట వృథాకాలహరణము.

వెన్నెలకంటివారి కుటుంబము పూర్వవాసస్థలము నెల్లూరుమండలము. “కవులపుట్టిల్లు వెన్నెలకంటియిల్లు" అనువిశేషణమున కనుకూలముగా నీకుటుం

  1. విష్ణుపురాణ కృతిభర్తయగు బసవయరాఘవుఁడు క్రీ. శ. 1526-29 ప్రాంతమున నుండెననియు నితనిశాసనము బట్టరువర్తుగారి శిలాశాసనముల వాల్యుము 2 లో నెల్లూరుజిల్లా కనిగిరిశాసనములలోఁ జూడుమని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ప్రబంధరత్నావళి పీఠికలోఁ జెప్పిరి. ఆశాసనము చూచి విమర్శించవలసిన యవసరమున్నది. ఈ యంశము పీఠికయంతయు ముగిసినపిదపఁ జూచుటచేఁ జర్చించఁజాలకపోతిమి. ఈ నిర్ణయము మేము నిరూపించినకాలమునకు సరిపడియున్నది.