పుట:Andhra-Bhasharanavamu.pdf/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

కొమ్మునా వాద్యభేదమును శృంగమౌఁ గందునా శిశుకళంకములు దోఁచుఁ
జిలుమువా లనఁగను జిలుము పట్టినకత్తి యులిపికట్టె యనఁ జెన్నలరుచుండు
ధౌతవస్త్రంబు కేదారమౌ మడి యనఁ గుండు నాఁగను హయగోళము లగు
వ్యంజనశ్వాసము ల్వఱలు నూరు పనంగ వనిత శాఖయుఁ గొమ్మ యనఁ జెలంగుఁ
గైవడి యనంగఁ దగు రీతి కరజపంబు రాయి సారాయి కల్లునా రహి వహించుఁ
గమ్మ యనఁగను జాబును గర్ణభూష పొల్చుచుండును శ్రీ మాతృభూతలింగ.

52


సీ.

ఖట్వాంగరేఖలు కనుపట్టుఁ గోడునా ఘటికార్గళంబులు గడియ యనఁగ
బవనపిశాచము ల్సరఁగు గాలి యనంగ గట్టునాఁ దీరనగంబు లలరు
వృత్తాంతదంభము ల్వెలయును గబు రన బంతినాఁ గందుకపంక్తు లెసఁగు
నరసంఘనికటముల్ పరఁగు జేరువ యన నండతారకలు గ్రు డ్డనఁగ మీఱు
ఘూకకర్ణైకదేశము ల్గూబనఁ దగు గంట యనఁ బైరుదుంపయు ఘంట యొప్పు
నుపలరాశియు నణుకువాఁ డొప్పుచుండు గుంట యని పల్కంగ సుగంధికుంతలేశ.

53


సీ.

శ్రవణైకదేశ మాచ్ఛాదనగేహంబు మీఱుచునుండు గుడార మనఁగ
యవనాశ్వభేదంబు లలరుఁ బటాణినాఁ దొలినాఁగఁ బూర్వంబు బిలము దోఁచు
బంధువు ల్వలయము ల్పరఁగుఁ జుట్ట లనంగఁ దెఱవరా బయలును స్త్రీ దనర్చు
దంతక్షతంబు రత్నం బగుఁ గెంపునా దండనానికటంబు ధామ మొనరు
బొందళము యుగి జోడనఁ బొల్పు గాంచుఁ జెలఁగు విరళంబు సాంద్రంబు జీబురాఁగ
గందపట్టె యనంగను జందనానులేపన కవాటపట్టిక ల్మీఱు నభవ.

54


సీ.

కంఠభూషాలతికలు దోఁచుఁ దీఁగనా స్థూలము గుణ మొప్పుఁ దోర మనఁగ
మార్గకుష్టంబులు మనుచుండుఁ చెన్నునా బాలునా క్షీరంబు భాగ మెసఁగుఁ
గాంతిధ్వజంబులు కనుపట్టు డాలునాఁ జంద్రమాసంబులు చను నెల యన
శిశువు కనీనిక చెలఁగుఁ బాప యనంగఁ బలుకునా శకలభాషలు దనర్చు
దోఁపు నాఁగను దగు నల్లతుమ్మచెట్టు బట్టపేరును శృంగారవనముపేరు
బాళియును గోటవెలిమంటపంబు దోఁచుఁ దనుక మనఁగను మాతృభూతాభిధాన.

55


సీ.

జాతనూతకమును సమ మగుఁ బురుడునాఁ బెంపునా నాశంబు వృద్ధిదోఁచు
నెమ్మినా బర్హిసఖ్యమ్ములు దనరారు నాడునా దేశ దినమ్ము లెసఁగు
శయ్య విస్తారంబు చనుచుండు బరుపునాఁ బగలునా ద్వేషదివాఖ్య లెసఁగుఁ
దామనామంబులు దనరును బేరునా బాసనా శపథంబు భాష వెలయుఁ
బోఁగునాఁ దంతువును గర్ణభూష మీఱు వెలయు శిశువత్సములు పసిబిడ్డ యనఁగ
సింహపూర్ణోపమానము ల్సెలఁగును నెఱ సరి యటం చని పలుకాఁడఁ జంద్రచూడ.

56