పుట:Andhra-Bhasharanavamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

లాంగలాదికము చెలంగు నే రనఁగను బరఁగుఁ దర్థాభిఖ్య యరక యనఁగఁ
గోటే రనంగను గొఱలు విపర్యయబద్ధలాంగలసంజ్ఞ పంట యనఁగ
నగుఁ గృషిసన్నాహ మలరు నాఁగేలు నాఁగలి యనఁగాను లాంగలసమాఖ్య
పరఁగుఁ దత్పృష్ఠంబు పడత యనంగను జీర్ణలాంగలసంజ్ఞ చెలఁగు గొనమ
యనఁగ నేఁడికోలనఁగను నెసఁగు నీష ముష్టిసంగ్రాహ్యదారువు పొలుచు మేడి
యనఁగ యంతిక నామధేయంబు జడ్డి గ మన విలసిల్లుచుండును గాలకంఠ.

232


సీ.

గుంటుగ నాఁగను గొఱ్ఱునా దంతినాఁ బాపడ మనఁగను బరఁగును గృషి
సాధనభేదము ల్చనుఁ బలు గనఁగను ఫాలాభిధానంబు పరఁగుచుండు
దిండడ నాఁగను దిర్యగారోపితదారువు గుజ్జునాఁ దనరుఁ గుబ్జ
దారువు కృషిసంజ్ఞ మీఱుఁ గిసుక దుక్కి యనఁ జాలునాఁగ సీతాఖ్య దనరు
మున్నరక యనఁ దొలిదుక్కి పొదలుచుండుఁ బ్రబలు సీతానివృత్తి కొండ్ర యన గుంట
యనఁగఁ గల్ల మనంగ ఖలాఖ్య వెలయు ఖలముఖము వాగళం బన నలరు నభవ.

233


సీ.

గుంజనాఁగను గట్టుకొయ్యనాఁగను మేధి పయి రన సస్యంబు పరఁగుచుండుఁ
జిరుతరి పచ్చగన్నేరు తీఁగెమల్లియ బుడమ రాజనమునాఁ బొలుపుఁ గాంచు
వ్రీహిభేదమ్ములు వ్రీహిసామాన్యంబు వరి వడ్లు నాఁగను వఱగుచుండు
గోదుమ యనఁగను గోధుము ల్విలసిల్లు లంక యనంగఁ గలాయి మొప్పు
నారుగ యనంగఁ గోద్రవాఖ్య తనరారుఁ గొఱలుచుండఁ: బ్రియంగువు కొఱ్ఱ యనఁగఁ
బొలుచుఁ జూర్ణంబుజొన్న నా బుసుకుజొన్న యనఁగఁ జూర్ణవిశేషమౌ నహివిభూష.

234


సీ.

సజ్జయం చనఁగను సర్జము విలసిల్లు శ్యామాక మొప్పును జామ యనఁగ
వరియం చనగను వరకము దనరారు రాగియం చనఁగను రాగి వెలయు
ముద్గంబు పెసరునాఁ బొల్చును గారుపెసరునాఁగ వనముద్గ చెలఁగుఁ
గాకిపెసరునాఁగఁ గనుపట్టు క్షుద్రముద్గము మిను మనఁగ మాషము దనర్చు
నను మనంగను నిష్పావ మలరుచుండుఁ బరఁగు బొబ్బర యనఁగను బర్బరము
తువరి కంది యనంగను దోఁచు రాజమాష మలసంద యనఁదగు మాతృభూత.

235


సీ.

ఒప్పుఁ గుళుత్థాఖ్య యులవయం చనఁగను దిలసంజ్ఞ నూవనఁ దేజరిల్లు
సెనిగెనా సెనగనాఁగను జణకము మీఱు నాసురి దనరారు నావ యనఁగ
మెంతి యనంగను మేంథినామము తగు శణము భాసిల్లును జను మనంగ
దవసంబు కొలుచునా ధాన్యంబు రాజిల్లు ముల్లునా శూకంబు పొలుపు గాంచు
నె న్ననఁగఁ గణిశ మలరు నీఁచ యనఁగఁ గణిశవృత్తంబు చెలఁగును గంకి యనఁగ
ధాన్యకణిశంబు వెలయును దైత్యవైరి భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

236