పుట:Andhra-Bhasharanavamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

పంచించె ననుటకుఁ బండించె ననఁగను గికురించె ననఁగను గేరుచుండు
దీకొనె ననఁగను డీకొనె ననఁగ నెదుర్కొనె నంచును దోఁచుచుండు
బురపురఁ బొక్కె నాఁ దఱుచుగా వెతలను జెందె నంచనుమాట చెలఁగుచుండు
వార్చెనాఁ గడిగె నుపాసించెఁ గెడసె నుద్దేశించె నాఁగను దేజరిల్లు
వెలయు వెన్నాడె నాగను వెంబడించె ననుటకు వెలార్చె వెదచల్లె ననఁగఁ జల్లె
ననుటకుఁ జెలంగు వినఁడాయె ననెడిమాట కలరుఁ బెడచెవిఁ బెట్టెనం చని మహేశ.

136


గీ.

మించు రిక్కించె ననఁగ నిక్కించె ననుట, చనును పారువఁ జూచెనాఁ జక్కఁగాను
జూచె ననుటకు సలిపెనాఁ దోఁచుఁ జేసె, ననెడిమాటకు మాతృభూతాభిధాన.

137


క.

పటుతాళించె నవంగను, నటునిటు బెళుకంగఁ జూచె ననుటకుఁ దోఁచున్
జిటికె ననంగను విలసిలుఁ, జిటికలు వేసె ననుమాట చెవ్వందీశా.

138


గీ.

అడిగెఁ బతికె వండె నడ్డగించెను గోసె, ననఁగ నిట్లు కొన్ని యగు ద్వికర్మ
ధాతువులుగఁ దెలియఁ దగు వానినెల్లను, మహితగుణసమేత మాతృభూత.

139


సీ.

ప్రోచుచున్నాఁ డనఁ బ్రోచుచున్నా వనఁ బ్రోచుచున్నా ననఁ బొలఁచు లట్టు
ప్రోచె ననంగను బ్రోచితి వనఁగను బ్రోచితి ననఁగను బొలుచు లిట్టు
ప్రోచు ననంగను బ్రోతు వనంగను బ్రోతు ననంగఁ బెంపొందు లృట్టు
ప్రోచుఁ గాత యనంగఁ బ్రోతువు గాతనాఁ బ్రోతును గాతనా బొలుచు లిఙ్ఙు
లార్థముల పురుషక్రియలందు నేకవచనములఁ దెల్పితిని బహువచనములను
జూచి యన్నిటి కిట్టు లెంచుకొనవలయు నాశ్రితనిధాన మాతృభూతాభిధాన.

140


గీ.

ప్రోవఁబడె ననఁ గర్మార్థమునఁ జెలంగుఁ, జనును బ్రోపించె ననఁగ ణిఙర్థరీతి
నలరు భావార్థమునఁ బ్రోచుటాయె ననఁగఁ, దక్కు నీరీతిఁ గనుఁగొనఁ దగు మహేశ.

141


గీ.

భావమునఁ బ్రోవు ప్రోచుట బ్రోవడ మనఁ, బరఁగుఁ గర్మార్థమునఁ బ్రోవఁబడినది యన
వఱలుఁ గర్త్రర్థమునఁ బ్రోచువాఁ డనంగ, మను సుబంతంబు లీజాడ మాతృభూత.

142


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగఁ క్రియావర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

143

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

గీ.

అశ్రుతగ్రామ్య విస్మృత వ్యర్థసులభ, శంకితాలస్య నిరుక్తశబ్దవితతిఁ
దక్క రచియించు నీకృతి దయను గొనుము, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

144