పుట:Andhra-Bhashabhushanamu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రభాషాభూషణము

29

క. వే రనియెడుశబ్దం బే
   పారం దెనుఁగులకు మొదల నధికత దెలుపున్
   బేరాఁకలి పేరామని
   పేరాముదపాకు లనఁగఁ బేరింపనఁగన్. 127

క. తన నా నీ యనుపలుకుల
   నెనయంగ హలాదు లదుకునెడ దుఱ్ఱు నగున్
   తనదుధనము నాదుగుణం
   బన నీదుయశంబు నాఁగ ననువై యునికిన్. 128

క. నెరిఁ గులజులపై సరి దా
   నెరయఁగ బహువచనషష్ఠి నిలుపఁగ నగుఁ గ
   మ్మరిగడి మేదరిగడి కం
   చరిగడి మూసరితెఱంగునను ననఁ జనుటన్. 129

తే. పెక్కుసంస్కృతశబ్దంబు లొక్కపదము
    క్రిందఁ దద్విశేషణము లిం పొందఁ గూర్చి
    తెలుఁగు తత్సమాసముక్రిందఁ గలుపునప్పు
    డగ్రపదముతో నిల నగు నర్థఘటన. 130

తే. తనవిశిష్టకులాచారధర్మ మనఁగఁ
    దనజగద్గీతసాధువర్తన మనంగఁ
    దనదిగంతరవర్తిప్రతాప మనఁగ
    నివి యుదాహరణంబు లై యెందుఁ జెల్లు. 131