Jump to content

పుట:Anarkali (1955)-Song Booklet.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆగ్రా రాజాంతఃపురంలో సలీముకు, పోయిన స్మృతి రప్పించటానికి ఎన్నో మందులు, మాకులు, వినియోగించేరు. కాని అతనికి తెలివిరాలేదు. అందరూ నిరుత్సాహపడుతుండగా అతనికోసం “ప్రేమజగాన, వియోగానికేనా, ప్రేమగాధ విషాదాంతమేనా' అని ఆక్రందిస్తూన్న అనార్‌కలి విషాద గీతం సలీములో చైతన్యాన్ని కల్గించింది. మహారాజదంపతులు యువరాజు పూర్తిగా కోలుకునేవరకూ తమ విశ్రాంతి మందిరంలో అతిధిగా వుండమని కృతజ్ఞతాపూర్వకంగా అడిగేరు; బలవంతపెట్టారు. కాదనలేకపోయింది. కాపురం పెట్టింది.

యువరాజు కోలుకున్నాడు. ఆనందానికి చిహ్నంగా అక్బర్ పాదుషా మహోత్సవాలు చేయించాడు. గుల్నార్ నృత్యగానాదులతో సభికులను ఆనందపరచింది. తరువాత మందగమనజిత రాజమరాళి అనార్‌కలి తన నృత్యగానాలతో సదస్యులను సంతోషపరచింది. రాజనర్తకిగా గౌరవింపబడింది.

రహస్యంగా సలీమును ప్రేమిస్తున్న గుల్నారుకి అనార్‌కలిపై ఈర్ష్య కలిగింది. వారి జీవితరహస్యం బట్టబయలు చేసి పగశాధించుకోవాలని నిశ్చయించుకున్నది.

సలీమ్‌కు యువరాజ్య పట్టాభిషేకంనాటి దర్బారులో అనార్‌కలి నాట్య ప్రదర్శనం యేర్పాటు చేయబడింది. ఇదే సమయమున గుల్నార్ అనార్‌కలితో కల్లబొల్లిమాటలు చెపుతూ ఆమె త్రాగే పానీయంలో మత్తుమందు పెట్టింది. అది అనార్‌కలికి తెలియదు. ఆమైకంలో నాట్యంచేస్తూ పాదుషా ముందే సలీమ్‌ను సమీపించి శృంగార ప్రదర్శనం చేసింది. అక్బరు ఆగ్రహించి ఆమెను చెరసాలలో వేయించేడు. సలీమ్ ఆ అన్యాయం సహించలేక తల్లి జోధ్‌బాయితో తన అంతరంగ రహస్యం వెల్లడించి అనార్‌కలిని తనకు దక్కించమన్నాడు. మహారాణీ పాదుషాకు ఎంత చెప్పినా ఆయన అణు మాత్రమైనా చలించలేదు. ఆతని నిర్ణయం మారదన్నాడు. సలీం పట్టరాని కోపముతో తన సైన్యాలతో ఆగ్రానగరంమీదికి దండయాత్ర బయలుదేరేడు. సలీం తండ్రిమీదికి కత్తిదూసే సమయానికి తల్లి అడ్డుపడింది. తల్లిమాట కాదనలేక ఎత్తినకత్తి దించేడు. అక్బర్ సలీమ్‌ను బంధించి చెరసాలలో వేయించేడు.

దర్బారులో అనార్‌కలి, సలీములను రాజద్రోహులను నేరారోపణ చేసి విచారించారు.

ఆ ప్రేమజీవుల కథ ఆపైని ఎలా పరిణమించింది? తెరపై చూడండి.