పుట:Ananthuni-chandamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"తగణము శ్రీకృష్ణయనఁగ” ఇటువంటి పద్యములు ప్రక్షిప్తములని వ్రాసినప్పుడు “మురారిభక్తితో వినుతింతున్," అని ఉన్న అవతారికలోని మొదటిపద్యము ప్రక్షిప్తమని చెప్పవలసిఉండును. గణముల కుదాహరణగా విష్ణుపరమైన పదములే ఉండనప్పుడు “మురారిభక్తితో వినుతింతున్" అని ఉండునా? "నిను నీవె పొగడువైఖరి నొనరించెదఁ,” అని కృతిభర్తను గూర్చి కవి వ్రాయునా? కవితావైఖరిని బట్టిచూడగా ఈ అవతారిక ప్రక్షిప్తమని దృఢముగా చెప్పవచ్చును. “రేచనపై.. కవివరులు.. పొగడన్” “నీదు పేర” “ఏ ఛందము సుకవులు బ్రదుకు" ఇటువంటి పదములతోనున్న కవిత్వము ఆధునికకవిత్వముగాని పూర్వకవిత్వమువలె తోచదు.

కొన్ని వ్రాతప్రతులలో "భీమనఛందస్సు” అని గ్రంథనామమున్నది. అయితే వాటిలో రామయ్యపంతులుగారు “ప్రక్షిప్తము”లని తీసివేసిన పద్యము లనేకముగా ఉన్నవి. "పరిగినవిమలయశోభాసురనిరతుఁడు భీమనాగ్రసుతుఁ [1]డఖిలకళాపరిణతుఁ డ

  1. ఈ భీమనాగ్రసుతుఁడు ‘అగస్త్యభ్రాత’ లాటివాడు; ఎవరో తెలియదు. "భీమన ఛందస్సన్న" పేరు గలిగి మనకు కనబడుచున్న వ్రాతప్రతులలోని గ్రంథము రచించినవాడు భీమనాగ్రసుతుడు; గాని, భీమనకాడు. వ్రాతప్రతులన్నిటిలోను భీమనఛందస్సు కలగూరగంపగా ఉన్నది. తక్కినఛందోగ్రంథములలోని లక్షణములున్ను ఉత్తరాంధ్రకావ్యములలోని లక్ష్యములున్ను ఉన్నవి. కొన్నిటిలో భీమనమతము స్పష్టముగా నిరాకృతమయి ఉన్నది. ఈ భీమనాగ్రసుతుడో, ఆపేరిటివాడు వేరేమరియొకడో, 'సర్వలక్షణసార' మనుగ్రంథము రచించినట్టు తంజావూరి సరస్వతీమహల్ పుస్తకాలయములో 327-వ నెంబరుగుల వ్రాతప్రతినిబట్టి కనబడుచున్నది. అందులో "పరగిన విమలయశోభాసురచరితుఁడ భీమనాగ్రసుతుఁడ” అని గ్రంథకర్త వ్రాసుకొన్న పద్యమున్ను ఇంకా 'భీమనఛందస్సు'లో ఉన్నట్లే అనేకపద్యములున్ను ఉన్నవి. 17-వ శతాబ్దారంభము నాటి మల్లన రచించిన చంద్రభానుచరిత్రలోని పద్యమున్ను ఇంకా మరికొన్ని కావ్యములలోని పద్యములున్ను ఉదాహృతమై ఉన్నవి. దీనినిబట్టి చూడగా భీమన 16వ శతాబ్దాంతమునాటివాడు కావలెను. కళింగదేశము రాజయిన రాజరాజు 11 వశతాబ్దము వాడుగదా? ఈ భీమన ఆరాజరాజును తనకవితామహిమచేత గద్దెమీదనుండి పడద్రోసి తిరిగీ గద్దె నెక్కించడము ఎట్లు సంభవమగును? ఈకవితామహిమానువర్నముగల రెండు చాటుపద్యములు మాత్రమే ఆధారముగా చేసుకొని భీమన రాజరాజనాటివాడనిన్ని భీమనఛందస్సు ప్రాచీనతమమయినదనిన్ని చెప్పుటకు శ్రీరామయ్యపంతులుగారు సాహసించడము వింతగా ఉన్నది. కవిజనాశ్రయములోనివి కావని తమకు తోచినవి ప్రక్షిప్తములని చెప్పి కొన్ని, చెప్పక కొన్ని, గాలించి తీసివేసి, కొంతభాస తమకు తోచినట్లు మార్చి, భీమనఛందస్సులో మిగిలి ఉన్న పద్యాలు 'అసలు' కవిజనాశ్రయమని పంతులుగారు ప్రకటించినారు. ఇది ఆంధ్రసారస్వతమునకు కొంత ఉపచరించినదని కృతిజ్ఞతతో ఒప్పుకుంటూ, ఈ గ్రంథము మరికొన్ని ప్రతులసాయమున చక్కగా విమర్శించి సంప్రతించి అచ్చొత్తించుట అగత్యమని తెలియజేయుచున్నాను. పంతులుగారి పరిష్కరణములోని దోషములు రెండువిధము లయినవి. i. గ్రంథములో చేరకూడని పద్యములు చేర్చినారు. ఉదా. 1. సంజ్ఞా. 90, 91, 92 ఇవి కావ్యాలంకారచూడామణియందున్న పద్యములు “ప్రక్షిప్తము లైనవేమో యని సంశయింపఁదగియున్న” దని కిందను వ్రాస్తూ గ్రంథమున చేర్చివారు. 2. ఉత్తమగండచ్ఛందములోనిది, “సభలం జెప్పిన” అనేపద్యము (46). ఇందులోని విషయములు పూర్వపద్యములలోని (38, 39) విషయములకు విరుద్ధముగా ఉన్నవి. 3. అవతారిక పద్యములు. అనంతచ్ఛందములోని పద్యములు; ii. గ్రంథములో చేరవలసినవి విడిచినారు: ఉదా. విశ్రాంతివిరతి అనేకందమునకు బదులుగా “రేచనకీర్తి గలుగు” అనేమాటలు గల గీతపద్యము చేర్చుకోవలసియుండెను. ఇంకా ఇటువంటివి ఉన్నవి.