పుట:Ananthuni-chandamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇందులో పాదమునకు 28 అక్షరములు; 36 మాత్రలు ఉన్నవి. పాదమున ప్రాసయతి నియమములేదు; మూడుచోట్ల అంత్య ప్రాసనియమము మాత్రమున్నది.

నడక

కోట్లకొలది వృత్తములు పుట్టినా లాక్షణికులు సుమారు 200 వృత్తములకంటే ఎక్కువ పేర్కోలేదు. వాటిలో సుమారు 30 కంటే ఎక్కువగా కవులు వాడడములేదు. ఎందుచేత? లాక్షణికులు చెప్పిన లక్ష్యలక్షణపద్యములు చూచినా కొన్నివృత్తములనడక తెలియదు. పద్యములనడక ఏలక్షణముబట్టి ఉండునో ఆలక్షణరహస్యము తెలిసినయెడల వేలకొలది కొత్తకొత్తవృత్తములను ప్రస్తరించి తీయవచ్చును. ఆరహస్యము తెలియకపోవుటకు మన గణవిభజనసంప్రదాయము ముఖ్యమైన కారణము. మూడేసిఅక్షరములు గణమంటే గణవిభజన పద్యము నడక బట్టి ఉండడ మసంభవము. నడక బట్టి గణవిభజనము ఉంటేనేగాని గణవిభజన ప్రయోజనము కనబడదు. కొన్నివృత్తములు చక్కగా నడిపించుటకు వీలున్నా లాక్షణికులు తమలక్ష్యపద్యములు వ్రాసినట్లు వ్రాయకపోవడముచేత కవు లావృత్తములను చెప్పడములేదు. అందుకు అనేక ఉదాహరణములు చూపించవచ్చునుగాని ఈ పీఠికలో అవకాశము చాలదు గనుక మూడు మాత్రమే చూపిస్తున్నాను.

(I) పాలాశదళము (దీనికే 'త్వరితగతి' యనికూడా పేరున్నది.)