పుట:Ananthuni-chandamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కావున,నా గ్రంథమె యన్నింటిలోఁ బ్రాచీనమైనదని యూహింపవచ్చును” అని రామయ్యపంతులుగారు 'ఆంతరతమ్య' పరీక్ష చేసి సిద్ధాంతీకరించినారు. అయితే అప్పకవి ఏడువిధములైన సీసభేదములే చెప్పగా అనంతుఁడు పదివిధములైన సీసభేదములను చెప్పినాడుగదా. అంతమాత్రమున అనంతుఁడు అప్పకవి తర్వాతివాడని చెప్పవచ్చునా?

శ్రీ రామయ్యపంతులుగారు సంపాదించిన కవిజనాశ్రయప్రతులు 10. అందులో రెండుమాత్రమే సమగ్రముగా ఉన్నవి. ఆ రెండింటిలోను అవతారిక పద్యములు లేవు; అసమగ్రమైన ఒక్క ప్రతియందు మాత్రమే ఉన్నవి. వాటిలో ఒక పద్యమును బట్టి గ్రంథము భీమకవి రచించియుండునేమో అని అనుమానించుటకు

కాస్త అవకాశము లేకపోలేదు, గాని అన్నిప్రతులలోను ఉన్నట్లు చూపిన [1]"జననుత భీమతనూజా,” అనే పద్యమును బట్టి ఏమనవలెను? ఇంతకున్ను ఒక్కప్రతిలో మాత్రమే ఉన్న అవతారిక ఎంతమట్టుకు ప్రమాణముగా గ్రహింపగలము? అందులోనున్న పద్యములు పరిశీలించి చూడగా అసందర్భములుగా ఉన్నవి. మొట్టమొదటి పద్యము అనంతుని ఛందములోనిది.— "ననంతశయనుఁ దోయజనాభున్," అని ఛందోదర్పణములో ఉన్నది, “మురారిభ క్తితో వినుతింతున్,” అని కవిజనాశ్రయములోఉన్నది. “జైనుఁడగుకవి విష్ణుప్రతిపాదకములగు పద్యముల రచించుట యసంభవ” మని “చనుమగణము శ్రీనాథాయనిన”

  1. సంజ్ఞా -88