పుట:Ananthuni-chandamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. చంచులనాస్వా+దించుచు లేఁదూం+డ్ల కరువుప్రియలకు+నలఁచుచు మైరో
మాంచము. ... (నన్నెచోడుని కుమారసంభవము.)

కావు గనుక ఇందులో విశేష మేమంటే అప్పకవికాక, తక్కిన తెలుగులాక్షణికులున్ను కన్నడలాక్షణికులున్ను చెప్పినట్లు పాదములందు ప్రాసయతి ఉన్నది; కాని తెలుగు లాక్షణికులు చెప్పిన వడినియమము పూర్తిగా లేదు. పాదద్వితీయార్థమునగల విశ్రమస్థానముల రెంటను ఉన్నవడి అక్షరములు తమలో తాము మైత్రి గలవేగాని పాదాద్యక్షరముతో మైత్రి గలవి కావు గనుక నన్నెచోడునిపద్యము వృత్తముకాదనిన్ని మాత్రాపద్యమనిన్ని సీనమువలె నున్నదనిన్ని అందుచేత “ఇది నన్నెచోడుని ప్రాచీనత కొకగొప్పకారణ” మనిన్ని మా. రామకృష్ణకవిగారు వ్రాసినారు. వృత్తముల కుండవలసిన ముఖ్యలక్షణము ఉన్నది గదా ఇది వృత్తముకాదని కవిగారు ఎట్లు చెప్పగలరు? నాలుగు పాదములందున్ను గణము లొకేతీరున ఉన్నవి. (మాత్రాపద్యములందు అన్ని పాదములలోను గణము లొక్కరీతిగా నుండనక్కరలేదు.) తెలుగుకన్నడపద్యముల సంప్రదాయ మనుసరించి నాలుగు పాదములలోను ద్వితీయస్థలమున ప్రాసమున్నది. లయగ్రాహి మొదలయిన ఉద్ధరమాలావృత్తములలో ఉన్నట్లు ప్రతిపాదమున కొంతవరకు ప్రాసయతి ఉన్నది. జాత్యుపజాతులు మొదలయిన దేశ్యపద్యములలో చేరదు. ఇది ఒక రీతి క్రౌంచపదము; దీనికి సరియైనలక్షణము ఏలాక్షణికుడున్ను చెప్పలేదు.