పుట:Ananthuni-chandamu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఛందోదర్పణములో నాలుగవ ఆశ్వాసము చివర నొకపద్యమందు భోజరాజీయమును మాత్రమే పేర్కొనుటచేత అనంతుడు మొట్టమొదట భోజరాజీయము, తర్వాత ఛందోదర్పణము, అటుపిమ్మట రసార్ణవము రచించిఉండునని ఊహించవచ్చును.

గ్రంధవిశేషము

తెలుగున లక్షణగ్రంథము లనేకముగా ఉన్నవి. వీటిలో అనేకగ్రంథము లింకను అచ్చుపడలేదు. 1917 సం॥న కవిజనాశ్రయము ఆంధ్రసాహిత్యపరిషత్తువారిచే కొత్తగా ప్రకటితమైనది. నేటికి శ్రీ వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారిచే ఈ ఛందోదర్పణము ప్రకటితమైనది. రంగరాట్ ఛందము మొదలయిన గ్రంథములు వీరిచే త్వరలో అచ్చుపడవలసి ఉన్నవి. ఇదివరకు చాలాకాలమయి అచ్చుపడి ప్రచారములో ఉన్నవి సులక్షణసారము, అప్పకవీయము.

వీటిలో కవిజనాశ్రయము ప్రాచీనతమమయి నట్లగపడుచున్న దనిన్ని, ఆ గ్రంథము రచించినవాడు వేములవాడ భీమకవి అనిన్ని, ఆ భీమకవి 12-వ శతాబ్దారంభము వాడగుననిన్ని, శ్రీ జయంతి రామయ్యగారు కవిజనాశ్రయపీఠికలో వ్రాసినారు. “కవిజనాశ్రయము భీమకవివిరచితము కానే కాదని నాకు తోఁచుచున్న" దని వీరేశలింగము పంతులుగారు రామయ్యపంతులుగారి 'పీఠిక' చదివినతర్వాతనే [1]ఆంధ్రకవుల చరిత్రలో వ్రాసినారు. “కవిజనాశ్రయములో చెప్పఁబడిన యతులసంఖ్య యన్నింటికంటెఁ దక్కువది,

  1. 1917- పుట 362, ఆంధ్రకవులచరిత్ర, రెండవకూర్పు.