పుట:Ananthuni-chandamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొనుటకు ఉపయోగించలేదు. మొత్తమునిూద వారు చెప్పినట్లు, “దిద్దుబాట్లు లేనట్టియుఁ దప్పులకుప్పలు కానట్టియుఁ బ్రతులు దుర్లభంబులై యుండుటచేత నన్నపార్యుని యక్కరలవైఖరి నిర్ణయింప శక్యము గాకున్నది.” అనుట ఇప్పటివరకు నిజమే. అయినను విమర్శించి ఊహించుటకు వల్లనయినంతమట్టుకు సంభావ్యమైన లక్షణము నిరూపించుటకు మనము యత్నించవచ్చును.

నన్నయ కన్నడలక్షణము ననుకరించి ఉండునని తేకుమళ్ల రాజగోపాలరావు పంతులుగారు ఊహించిరి. ఇది నాకు సమ్మతమే. అయితే అందువల్ల మధ్యాక్కరపాదములో మూడవగణము గగమైనా సగణమైనా కూడా కావచ్చును అని మాత్రమే తేలినది. ఎందుచేతనంటే: కన్నడమువారు మధ్యాక్కరకు 4,5 మాత్రల విష్ణుగణములే ఉండవలెనని చెప్పుటచేత అవి మనవారు చెప్పిన ఇంద్రగణములే అయినవి. చివరగణము గుర్వంతమైన అజగణము కావలెనని కన్నడము వారు చెప్పినారు; గాని నన్నయ దానిని పాటించినట్టు కనబడదని వారే ఒప్పుకోవలసివచ్చినది అని బొడ్డపాటి రాజన్నపంతులుగారు ఆక్షేపించినారు. గాని ఈ ఆక్షేపణమునకు సమాధానము చెప్పవచ్చును. సంస్కృతములో ఉన్నట్లే కన్నడములో కూడా పాదాంతవర్ణము లఘువైనా కావలసినప్పుడు గురువుగా పాటించవచ్చును గనుక తక్కినవిషయములలో కన్నడలక్షణమును నన్నయ అనుకరించినాడని చెప్పినప్పుడు ఈవిషయములో కూడా అతడు అనుకరించి ఉండవచ్చును అని చెప్పుట తప్పుకాదు. దీనిని బట్టి,