పుట:Ananthuni-chandamu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మవలంబించవలసినంత అవసరము కనబడదు. ఇదివరకున్న సంప్రదాయమును, ఇదివరకు తెలుగు లాక్షణికులు చెప్పిన లక్షణమును (యతివిషయము తప్ప) అనుసరించి చూచినయెడల శాసనములోని మధ్యాక్కరలు సిద్ధలక్షణసమన్వితములై ఉన్నవి.

అయితే నన్నయ మధ్యాక్కరల లక్షణము కనుగొనుట కష్టముగా ఉన్నది గనుక వాటిలక్షణము నిరూపించడమే యోజనముగా తలచి శాస్త్రిగారు ఈ వాద మవలంబించినారంటే, సంతోషమే, కాని, వారి మనోరథము నెరవేరినట్టు కనబడదు.

"అరుణసరోరుహదళమృదులంబులైన యత్తరుణి”
“పరగనాకారణమున నిట్టి దుఃఖభారముఁ దాల్చె”

ఈ పాదములు లొంగలేదని వారే ఒప్పుకొన్నారు.

“అవసరజ్ఞుడైన వేదవ్యాసు డేతెంచె నంత నత్తపసి
కపిల గడ్డంబును గపిల జడలునుం గపిల కన్నులును
తపశి యన్నువపొడవు నల్లని దీర్ఘ తనువు(ను) జూచి
యువిదయు గనుగవమూశి తెరువకయుండె భయమునా”

ఇది తమవద్దనున్న “ప్రతులలోఁ బ్రాచీనపుఁబ్రతిలోని” దని చూపించి “ఈ పద్యము వెనుక నే నుదాహరించిన శాసనాక్కరల లక్షణమునకు లొంగియే యున్న ”దని వ్రాసినారు.

ఇందులో 3–వ పాదము ఎట్లు లొంగియున్నదో తెలియదు.