పుట:Ananthuni-chandamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈలాగున పరిశీలించి చూచిన యెడల నన్నయ మధ్యాక్కరలు తెలుగులాక్షణికులు చెప్పిన లక్షణమునకు కొంచెము విరుద్ధముగా ఉన్నవి. అయితే నన్నయ మధ్యాక్కరలకు వేరేలక్షణము చెప్పగలమా?

ఈవిషయము కొంతవరకు విమర్శించినవారు, టేకుమళ్ల రాజగోపాలరావుగారు, శ్రీ వఝల చినసీతారామస్వామి శాస్త్రులవారు మొదలయినవారు.

వీరిలో శాస్త్రులవారు [1]ఒక క్రొత్తమార్గ మవలంబించి నన్నయమధ్యాక్కరలకు లక్షణసమన్వయము చేయబోయినారు గనుక వారు చెప్పినది మొట్టమొదట విమర్శించవలసి ఉన్నది.

శాస్త్రులవారు అవలంబించిన మార్గమునకు యుద్ధమల్లునిశాసనములోని మధ్యాక్కరలే ఆధారము. ఆశాసనములో అరసున్నలు లేవు. అవి పూర్వకాలపులిపిలో లేనేలేవు. లేకపోవుట పూర్వకాలపు లేఖనసంప్రదాయము. అర్ధానుస్వారము లుండదగినచోటకూడా పూర్ణానుస్వారములే ఉన్నా వాటికి పూర్వ మందున్న హ్రస్వాక్షరము ఛందోనియమములకు సరిపడునట్లు ఊదిపలుకుటగాని తేల్చిపలుకుటగాని సంప్రదాయవిరుద్ధము కాదు, ఇందుకు దృష్టాంతముగా చూడండి:—

  1. ఆంధ్రచ్ఛందస్సులు, ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక సంపుటం 8 సంచిక 2.