పుట:Ananthuni-chandamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గణములు, ఒక సూర్యగణము, రెండు ఇంద్రగణములు, ఒక సూర్యగణము ఉండును. అన్ని అందరున్ను మూడవగణము తర్వాతనే వడి నియమించినారు.

నన్నయ మధ్యాక్కరపాదములలో నాల్గవగణము తర్వాత వడి కనిపించుచున్నది. యుద్ధమల్లుని శాసనాక్కరలలో సైతము నాల్గవగణము తర్వాతనే వడి ఉండడముచేత పూర్వము అట్లే వడిస్థాన ముండేదని ఊహించవలసి ఉన్నది. తిక్కన మధ్యాక్కరలు చెప్పలేదు. ఎర్రాప్రెగడ మూడవగణము తర్వాతనే వడి పాటించినాడు. మరి యేకవిన్నీ మధ్యాక్కరలు చెప్పినట్టు కనబడదు. లాక్షణికులు ఎర్రాప్రెగ్గడ పాటించిన వడి గురించే చెప్పినారు గాని నన్నయపాటించిన వడి గురించి చెప్పలేదు.

నన్నయ మధ్యాక్కరలకున్ను తెలుగులాక్షణికులు చెప్పిన మధ్యాక్కరలకున్ను వడిస్థలములోనే భేదమున్నదా లేక గణములలో సయితము భేదమున్నదా? ఇటువంటి ప్రశ్న పుట్టుటకు కారణ మేమంటే, పాఠభేదములు అనేకముగా ఉన్నవి. నన్నయ ఎట్లు వ్రాసి ఉండునో తెలుసుకొనుట కష్టముగా ఉన్నది. వాటిలో అనేకపాదములందు గణములతీరు తెలుగులాక్షణికులు చెప్పినట్లు లేదు. భారతము పరిష్కరించి అచ్చు వేయించినవారు తెలుగులాక్షణికుల మతము ననుసరించి సవరించినారు. ఎంతో శ్రమపడి వారు ఆలాగున సవరించి అచ్చువేయించినా అచ్చుపుస్తకములలో కొన్ని పాదములందు గణములతీరు తెలుగులాక్షణికులు చెప్పినట్లు లేదు. చూడండి:—(వేమూరివారు ప్రకటించినది.)