పుట:Ananthuni-chandamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాగవతములో పోతనామాత్యుడు నన్నయవలెనే కొన్నినియమములను పాటించి పలువిధములయిన సీసములను చెప్పినట్లు వావిలికొలను సుబ్బారావుగారు పరిషత్పత్రికలో (సంపుటము 6 పుటలు 417-420) తెలియజేసినారు.

భాగవతము ఏకాదశస్కంధమున 72-వ పద్యము సర్వలఘుసీసము. లాక్షణికులు చెప్పినట్లు ఇందులో ఇంద్ర గణములకు బదులుగా 5 లఘువులగణము అన్నవి. ఇది తెలియక కాబోలు (చూ. ఆనంద ...1904 ముద్రితము) పుట అడుగున ఈసీసము లక్షణసమన్వయముగాక యున్నదని సంప్రతించినవారు వ్రాసినారు.

కూచిమంచి తిమ్మకవి మొదలయినకవులు కొంద రిట్లే సర్వలఘుసీసములు చెప్పినారు. గణపవరపు వేంకటకవిమాత్రము తన ప్రబంధములో నలములయిన ఇంద్రగణములతోనే సీసము వ్రాసినాడు (చూ. 75, 221 పద్యములు.)

ఆర్యలు, గీతులు

పథ్య, విపుల, చపల, ముఖచపల, జఘనచపల అని ఆర్యలు అయిదు. గీతి, ఉపగీతి, ఉద్గీతి, ఆర్యాగీతి అని గీతులు నాలుగు. ఈ తొమ్మిదిన్ని సంస్కృతచ్ఛందములో ఉన్నవి; కందమన్నపేరు దానిలో లేదు గానీ, ఆర్యాగీతిలక్షణము కందపద్యలక్షణమునకు సరిపోయినది. గనుక కందము గీతులలో ఒకటిగా చెప్పవచ్చును గాని అప్పకవి చెప్పినట్లు కందమును ఆర్య లయిదింటిలో చేర్చి కందము లారువిధములని చెప్పుట యుక్తియుక్తముగా లేదు.