పుట:Ananthuni-chandamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“ఆదినే వడి నిల్పి రావడే పదమెల్లఁ జేయ నయ్యది వడిసీస మనఁగ” అని అప్పకవి అనంతునివలెనే లక్షణము చెప్పి అందుకు లక్ష్యముగా ఇచ్చిన పద్యములో ఆ లక్షణము పాటించలేదు. అనంతుడు అక్కిలివడికి చెప్పిన లక్షణము మాత్రమే పాటించినాడు.

అనంతుడు 'అవకలిప్రాస' మన్నసీసమునకు అప్పకవి అవకలివడిసీసమని పేరుపెట్టినాడు.

ఇంతకున్ను ఎంతమట్టుకు ఈసీసభేదములు కవులు తమకావ్యములలో చూపించినారో విచారణీయము. “సప్తవిధము లివియ శబ్దశాసనుుడి, పంచమామ్నాయఫక్కిలోఁ బల్కెఁగాని, కడమకవు లాఱుసీసము ల్విడిచిపెట్టి చెలఁగి సమసీసపద్యమే చెప్పినారు” అని అప్పకవి వ్రాసినాడు; గాని ఇది సత్యము కాదు.

నన్నయ 13 విధము లయిన సీసములు చెప్పినాడు. వీటిలో రెండుమాత్రమే లాక్షణికులు చెప్పిన సీసభేదములలో ఉన్నవి:- (1) అక్కిలివడిసీసము (2) అవకలిప్రాససీసము. ఈవిషయము “తెలుగు” రెండవసంచికలో చర్చించినాను.

ఆవ్యాసమున చెప్పమరచిన దొకటేమంటే నన్నయసీసములలో రెండు (ఆది. 11. 21; 111. 27) వృత్తప్రాససీసము లున్నవి. అయితే వాటిలో ఒకవిశేషమున్నది. ప్రాసాక్షరము పశ్చిమార్థములందున్ను కలదు.

ఎర్రాప్రెగడ భారతములో నన్నయ చెప్పిన సీసభేదములు కలవు.