పుట:Ananthuni-chandamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దున్ను సమసీసములని చెప్పియన్నదిగాని సమసీసము ఒకసీసభేదముగా చెప్పలేదు.

“సీ. వృత్తంబునకువలె” అన్న పద్యము కవిజనాశ్రయములోను ఛందోదర్పణములోను ఉన్నది. ఇది సీసభేదముల పేళ్లు గలసీసము; అవకలిసీసమునకు లక్ష్యముగా ఉన్నది. ఇందులో వృత్తప్రాససీసమును సమసీసమును పేర్కొన్నారు. వీటికి కవిజనాశ్రయములో లక్ష్యపద్యములు లేవు; సీసభేదములను పేర్కొన్న గద్య వేరేఉన్నది; ఆగద్యలో ఈ రెండు భేదములు పేర్కొనలేదు. ఈవిషయము లన్నీ చూడగా ఈ పద్యము అనంతునిదే అనిన్ని కవిజనాశ్రయములో ప్రక్షిప్తమనిన్ని ఊహించవచ్చును.

ఈలాగుననే మరికొన్ని పద్యములు కవిజనాశ్రయము వ్రాతప్రతులలో దూరినవి, అని ప్రక్షిప్తములని ఆంధ్రసాహిత్యపరిషత్ప్రకాశితప్రతిలో పుట అడుగున సూచితమై ఉన్నది గాని ఈపద్యముగురించి ఏమియు చెప్పలేదు. పరిష్కర్తలు చూచిన అన్నిప్రతులందును ఈపద్య మున్నది కాబోలు.

అప్పకవీయములో లక్ష్మణపద్యమును బట్టి లక్ష్యములు సరిగా లేవు గనుక కవి అభిప్రాయము స్పష్టముగా తెలియదు. అతడు చెప్పిన సమసీసము, సర్వతఃప్ర్రాససీసము, విషమసీసము, సర్వలఘుసీసము అనంతుడు చెప్పినట్లే ఉన్నవిగాని, అప్పకవి అక్కిలిప్రాససీసమన్నది అనంతుని సమప్రాససీసమునకు సరిపోయినది. అయితే అందుకు లక్ష్యముగా అప్పకవి ఇచ్చిన పద్యములో చివరను “చెలఁగుచుండు వృత్తిప్రాససీసము లిల" అని ఉండుటకు కారణమేమో తెలియదు.