పుట:Ananthuni-chandamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. మౌక్తికమాలావృత్తము:——

“భక్తజనత్రాత +భతనగాసం
యుక్తములై మౌని+యుతయతుల్ సు—" (అప్పకవి)

తక్కినలాక్షణికులు ఈ వృత్తము పేర్కోలేదు.

సంస్కృతమున ఉన్నట్లు 5 తర్వాత విశ్రాంతి ఉంచి నేను వ్రాసినది చూడండి.

భక్తులఁ గాచే+వనరుహనేత్రున్
సూక్తులఁ బల్కే+సురుచిరగాత్రున్
ముక్తి నొసంగే+మునిజనమిత్రున్
మౌక్తికమాలన్+బలుమఱు గొల్తున్

ప్రాసము

అలంకారతుల్యములైన ప్రాసములు – సుకర, దుష్కర, ద్వి, త్రి, చతుష్ప్రాస, అనుప్రాస, అంత్యప్రాసములు ఏడింటిని అప్పకవి చెప్పినాడు. వీటిలో మొదటిదిగాక తక్కిన ఆరున్ను ఛందోదర్పణములో ఉన్నవి. చతుష్ప్రసముగాక తక్కినఆరున్ను కవిజనాశ్రయములోను, కావ్యాలంకారచూడామణిలోను ఉన్నవి. అయితే కావ్యాలంకారచూడామణిలో చతుష్ప్రాసప్రాసము లక్షణపద్యమందు కనబడకపోయినా దానికి లక్ష్యముగా త్రిప్రాసలక్ష్యపద్యము తర్వాత నొకపద్య మున్నది. ఇది ప్రక్షిప్తము కాబోలు.