పుట:Ananthuni-chandamu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అనుచు వడిసీసముల నిన్ను నభినుతింతు
రఖిలవిద్యావిశారదు లైన మునులు
పన్నగాధీశతల్ప నాపాలివేల్ప
భక్తజనకామ్యలాభ శ్రీపద్మనాభ!

31

అక్కిలివడిసీసము—

పద్మాక్షి యీతఁడే బలి రసాతల మేలు
           మని పంపనేర్చిన యధికబలుడు
హరిణాక్షి యీతఁడే యలవిభీషణు లంకఁ
           బట్టంబు గట్టిన బల్లిదుండు
తొయ్యలి యీతఁడే ధ్రువుని నున్నతపదం
           బునఁ ప్రతిష్ఠించిన భూరియశుఁడు
ధవళాక్షి యీతఁడే ధనువు ద్రుంచినయట్టి
           రఘువంశతిలకుండు రాఘవుండు


గీ.

బాణబాహావిఖండనప్రముఖుఁ డితడు
నీలగళసుప్తికరబాణనిపుణుఁ డితడు
ననుచు నక్కిలివడిసీస మమర వేల్పుఁ
బడఁతు లభినుతింతురు నిన్నుఁ బద్మనాభ!

32

అవకలిప్రాససీసము—

వరదుఁ డుద్యద్గుణాకరుఁడు వియన్నదీ
           పాదుఁడు భక్తప్రమోదకరుఁడు
సింధుబంధనుఁ డబ్జబంధుతారాధీశ
           నేత్రుఁడు కాశ్యపగోత్రజుండు