రవణావతారాలు:
...తమ్మా సత్యనారాయణ
తే|| చిత్ర, సంగీత, సాహిత్య, శిల్ప, నాట్య
వేత్తలెందరొ అక్షతల్ - చిత్తమలర
చల్లి, దీవెనలీయగా, వెల్లువెత్తు
పూర్ణ శుభములు ఈ "షష్టిపూర్తి" వేళ!!
తే|| తల్లిపాలనె గ్రోలిన - ధర్మగుణము,
వెన్నతో పెట్టినట్టిది - వినయ విద్య,
భక్తి సమ్మిశ్రమైన సేవాను రక్తి,
తరలివచ్చెను "రమణ"యై తగినవేళ!!
అ|| వెన్నముద్దవంటి, వెన్నెల గుడివంటి,
మేలి తెలుగువంటి, మీదు ఇంట -
శ్రీనివాసుడిచ్చు - సిరిసంపదల మాల
"షష్టిపూర్తి" వేళ సంతసమున!!
చం|| తెలియదు నిన్నునన్ను విడదీయని తీయని బంధమేదొ - ఈ
చెలిమిని గూర్చెనోరమణ! చిత్తములూనవి ప్రేమ పొత్తముల్;
కలము లిఖించలేని రసకావ్యము గావలె జీవితమ్ము! కో
వెలవలె శాంతిధామమయి - వెల్గునుగాక భవన్నివాసమున్!!
తే|| శ్రీల వెలయుత - మీ గృహసీమ సతము!
ప్రేమ సుమగంధ పూరిత ప్రీతమగుత!
స్నేహ, వాత్సల్య, సౌమనస్సేవ్య మగుత!
"సాయి" మృదుకరాశీస్సుధా శాయి యగుత!!
చం|| వ్యయమగుగాక - మీకుగల వ్యర్ధ ప్రభావిత కష్టనష్టముల్!
నయమగుగాక - సౌఖ్య అభినందన చందన స్పందనమ్ములున్!
ప్రియమగుగాక - నవ్యసుమపేశల రాగవసంతముల్! మహో
దయమగుగాక - జీవన సుధాకలశమ్ముగ భావికాలముల్!!