పుట:Anandam Manishainavadu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంఘటనలు, అభిప్రాయాలు రాసి ఇచ్చి వ్యాసంగా ఎడిట్ చేస్తే చూసి అంగీకరించారు. ఒకరిద్దరి విషయంలో వారితో సమయాన్ని గడిపి వారి మాటలు ఏరుకుని వారి భావాలు పేజీలపై పెట్టినవీ ఉన్నాయి. రెడ్డప్ప ధవేజీగారు, నామాల మూర్తిగారు ఏకంగా ప్రసంగంగా ఫోనులో ఏకపాఠంగా, ఆశువుగా చెప్పెయ్యడం విశేషం. వీరందరితోనూ మాట్లాడి, వారితో తెలిసినవీ, తెలియనివీ ఎన్నో కలబోసుకోవడంలో మా నాన్నగారి గురించి తెలియనివి ఎన్నో తెలుసుకున్నాను. ఆయన మేనల్లుడు శ్రీనివాసన్ చెప్పిన విశేషాలైతే ఆయనను సరికొత్తగా అర్ధం చేసుకునేలా చేశాయి. ప్రిజంలో చూస్తే తెల్లని సూర్యకాంతి ఏడు రంగులుగా కనిపించినట్టు వీరందరి మాటల్లో ఆయన వ్యక్తిత్వం వేయి రూపాలుగా కనిపించింది.

ఎన్నో విధాలుగా ఈ సంపుటిని జాగ్రత్తగానే తయారుచేసినా కొన్ని కోణాలు మరచిపోయి ఉండొచ్చు. ఆయనకు మాత్రమే తెలిసినవీ ఉంటాయి. మొదట పేర్కొన్న ప్రణాళిక పరిపూర్ణం కావాలన్నా, ఆయన అనుభవాలు, ఆయన కాలం, ఆయన తత్త్వం పూర్తిగా అందాలన్నా తప్పనిసరిగా ఆయన తన అనుభవాలు తాను రాసుకోవాలి. జ్ఞాపక శకలాలుగానో, అనుభవాల మాలగానో కాగితంపై పెట్టాలి. నేను ప్రారంభించిన ఈ ప్రణాళిక ఆయన తన ఆత్మకథాత్మక వ్యాసాలు రాసి పరిపూర్ణం చేస్తారని ఆశిస్తున్నాను.

సూరంపూడి పవన్ సంతోష్

సంపాదకుడు