మిత్రులతో "జైహింద్ నాటక కళాసమితి" ఏర్పాటు చేశారు. నిత్యం ఇంటిలో ఉపయోగపడేందుకు దొరికే ఏ వస్తువునైనా బాధ్యతగా తీసుకొచ్చేవారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల భవిష్యత్తు బాగుండాలని తపించేవారు. ఇన్ని చేస్తున్నా ఆయన విశ్వవిద్యాలయం స్థాయిలో తెలుగులో మొదటి స్థానంలో ఉత్తీర్ణులయినారు. 100% అటెండెన్స్‌కిగాను ఇచ్చిన సర్టిఫికెట్‌లు మా ఇంటిలో ఇంకా ఉన్నాయి. ఇవి ఆయన చిన్నతనం గురించి ఎవరెవరో చెప్పగా నాకు తెలిసిన విశేషాలు. ఈ లక్షణాలనే భావి జీవితం అంతా నిక్కచ్ఛిగా అమలు చేశారు.
ఉపాధ్యాయునిగా, కళాకారునిగా, గ్రంథాలయోద్యమంలో, వివిధ సంస్థలలో బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఎన్నెన్నో పాత్రలు పోషించారు. ఇన్నిటిమధ్య తనదైన వ్యక్తిత్వం, ప్రత్యేకత నిలుపుకొన్నారు. అటువంటి వ్యక్తి జీవితంలోని ఆసక్తికరమైన ఘట్టాలు, ప్రత్యేకతలు ఆయననుంచి స్ఫూర్తి పొందినవారు, ఆయనతో పనిచేసినవారు వ్రాస్తే అదొక విశిష్టమైన జీవితచరిత్ర అవుతందనే భావనతో ఈ పుస్తకాన్ని తయారుచేసాను.
'బహుముఖ ప్రజ్ఞాశాలియైన ఆయన జీవితంలో ఎన్నో కోణాలు ఉన్నాయి. వాటి నుంచి గొప్ప ఉపాధ్యాయునిగా, మంచి నాటక కళాకారునిగా, కళా, సాహిత్య సంస్థలలో ముఖ్యునిగా, గొప్ప వ్యక్తిత్వమున్న మనిషిగా, అవధానాల్లో అప్రస్తుత ప్రసంగానికి పేరుపొందిన పృచ్ఛకునిగా ఆయనలోని పాత్రలను ఆవిష్కరించేలా ఉండాలని నిర్ణయించుకున్నాము. ఈ అంశాలపై ఒక్కో వ్యక్తితో ఒక్కో వ్యాసం రాయించాము. ఆ వ్యక్తులను ఎంపికచేయడంలోనూ ఒక పద్ధతి పాటించాను. ఆయనకు ఎందరో ప్రఖ్యాత వ్యక్తులతో పరిచయం ఉన్నా, మరెందరో ఆత్మీయులు ఉన్నా సంబంధిత వివరాలు ఆ వ్యక్తికి ఎంతవరకూ తెలిసి ఉండొచ్చు అన్న ప్రశ్న వేసుకుని ఆ క్రమంలోనే ఎంచుకున్నాను. ఆయా రంగాల్లో ఆయనతో కలిసి పనిచేయడం, ఆయనను గమనించగల సాన్నిహిత్యం కలిగివుండడం, కొందరి విషయంలో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని జీవితాన్ని దిద్దుకోవడం వంటివే ప్రమాణాలుగా తీసుకున్నాను. వారితో వ్యాసాలు రాయించుకోవడంలోనూ ఎన్నో ప్రయత్నాలు చేశాను. స్వతహాగా రచయితలైన కొందరు నేరుగా వ్యాసాలు అందిస్తే, మరికొందరు