అవసరంలేకుండానే సమర్ధంగా రిపోర్టింగు చేయగలిగిన వారిని మాత్రం చాలా కొద్దిమందిని చూశాను. వెంకటరమణలో ఒక స్వతస్సిద్ధమైన జర్నలిస్టు వున్నాడు. నేను తిరుపతికి బదిలీ అయి వెళ్ళేముందు కలిశాడు. అతను జర్నలిస్టుగా రాణిస్తాడని నాకు విశ్వాసం కలిగింది. ఈ వృత్తిలోనే కొనసాగమని, మంచి భవిష్యత్తు వుంటుందని చెప్పాను. నేను విశాఖపట్నంలో వున్నా, ఢిల్లీలో వున్నా పశ్చిమగోదావరిజిల్లా వాళ్ళు ఎవరు కలిసినా వెంకటరమణ గురించి అడిగేవాణ్ణి. దాదాపు 20 సంవత్సరాల పాటు నాకు రమణ గురించి ఏమీ తెలియలేదు. పదేళ్ళ క్రితం ఈనాడు ఆదివారం అనుబంధంలో రమణ రాసిన కధనాలు చదివాను. విచారిస్తే తాడేపల్లిగూడెంలో వున్నట్లు తెలిసింది. నాలుగేళ్ళ క్రితం ఫోన్‌చేసి మాట్లాడినప్పుడు 1983 లోనే తాను టీచింగ్ వృత్తిలో స్థిరపడ్డాననీ చెప్పినప్పుడు మనస్సు చివుక్కుమంది. జర్నలిజానికి అవసరమైన విలువలు, నైపుణ్యం కల ఒక మంచి జర్నలిస్టు సమాజానికి దూరమయ్యాడు అనిపించింది. మూడేళ్ళ క్రితం, రమణ పదవీ విరమణ సభలో పాల్గొనే అవకాశం కలిగింది. గూడెంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. వేర్వేరు రాజకీయ పక్షాలకు చెందినవారు వచ్చారు. అందరూ రమణ గురించి, అతనిలో గల టీచింగు వృత్తి విలువల గురించి, నిజాయితీ గురించి, అన్ని వర్గాలవారు అభిమానించేలా వుండే అతని మానవ సంబంధాల గురించి మాట్లాడినప్పుడు చాలా ఆనందపడ్డాను. రమణకి నేను నేర్పింది ఏమీ లేదు. అయినా నన్ను "గురువుగారూ" అని సంబోధిస్తాడు. అది అతని సంస్కారం. అతను లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పిల్లలు సంతోష్, వల్లీ, గాయత్రీలతో మాట్లాడినప్పుడు, వాళ్ళు చదివే సాహిత్యం గురించి, వాళ్ళకి రమణ నేర్పిన మౌలిక జీవన విలువల గురించి విన్నప్పుడు గర్వంగా అనిపించింది. ఒక మంచి జర్నలిస్టు సమాజానికి సరైన దిశా నిర్దేశం చేయగలడు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఉత్తమ పౌరుల్ని తయారు చేయగలడు. ఈ రెండు వృత్తులలోనూ తనదంటూ ఒక ముద్ర వేసుకున్న వెంకటరమణ కుటుంబాన్ని ఆ వేంకట రమణుడి అనుగ్రహం ఎల్లప్పుడూ వెన్నంటి వుండాలని కోరుకుంటూ...
- వ్యాసకర్త పాత్రికేయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించి, ప్రధాన సంపాదకుని స్థాయికి ఎదిగిన వ్యక్తి. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలలో పత్రికారంగంలో పలు హోదాలలో పనిచేశారు. సంపాదకత్వం, అనువాదం, అనుసృజన, రచన రంగాలలో అందెవేసిన చేయి.