అపుడు గ్రంధాలయోధ్యమ నాయకులు పెమ్మరాజు బాపిరాజు అధ్యక్షునిగా, నేటి ప్రముఖ సినీ హాస్యనటుడు బ్రహ్మానందం ఉపాధ్యక్షునిగ, వెంకటరమణ ప్రధాన కార్యదర్శిగా గ్రంధాలయ అభివృద్ధి సంఘం ఏర్పాటుచేశాం. అనంతరం రమణ ఆధ్వర్యంలో ప్రముఖ అవధాని రావూరి వెంకటేశ్వర్లుని రప్పించి అత్తిలిలో అవధానసభ నిర్వహించారు. అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకునిగా రమణ ఆహుతులను కడుపుబ్బ నవ్వించారు. ఆ విధంగా గ్రంధాలయంలో ఎందరో ప్రముఖుల్ని రప్పించి కార్యక్రమాలు చేశారు. పెద్దల సాయంతో గ్రంధాలయాన్ని అభివృద్ధి చేశారు. ఆ గ్రంధాలయం 25 వ వ్యవస్థాపక దినోత్సవానికి వారం రోజులు సభలు నిర్వహించారు. రజతోత్సవ సంచిక విడుదలచేశారు. పాలి ప్రసాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షునిగా ఉండగా ఉత్తమ సేవలు అందించిన గ్రంధాలయ సేవకులకు అయ్యంకి వెంకటరమణయ్య అవార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ అవార్డుకు సూరంపూడి వెంకటరమణను ఎంపికచేసి జిల్లా సభలో ఘనంగా సన్మానించి, పురస్కారం అందజేశారు. ఇది అత్తిలి గ్రంధాలయ చరిత్రలో అపురూప విషయం. అత్తిలి గ్రంధాలయ అభివృద్ధి విషయంలో రమణ ఎంతో కృషిచేశారు. దీనితో ఆ ప్రాంత గ్రంధాలయాల అభివృద్ధికి తనవంతు సహకారం అందించారు. తాడేపల్లిగూడెంలో కూడా గ్రంథాలయ అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. పెమ్మిరాజు బాపిరాజు ఆధ్వర్యంలో రమణను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఉపాధ్యక్షులుగా విజయవాడలో ఎన్నుకోవడం ఆయన కార్యదీక్షకు వారిచ్చిన కితాబుగా చెప్పవచ్చు. గ్రంథాలయోద్యమ నాయకులు వావిలాల గోపాలకృష్ణయ్యను అత్తిలి తీసుకు వచ్చిన ఘనత రమణకు దక్కుతుంది. గ్రంథపాలకులందరికీ ఆయన ఎంతో సహకారం అందించారు. గ్రంథాలయ వారోత్సవాలు ప్రతీఏటా ఘనంగా జరపడానికి రమణ తన మిత్రులు వాసాభక్తుల హనుమంతరావు, హెచ్. వి. సురేష్ బాబ్జి, పెమ్మరాజు శ్రీనివాస్, జి. వి. వి. సత్యనారాయణ తదితులతో కలసి విశేష కృషిచేశారు. అందుకే ఆయన్ని అత్తిలికి "అయ్యంకి" మా వెంకటరమణ అని అంటాం. సాయిలక్ష్మి దంపతుల భావి జీవితం వైభవంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
- వ్యాసకర్త అనేక ప్రభుత్వ గ్రంథాలయాలలో పనిచేసి, ఉద్యోగ విరమణ చేశారు. సాహిత్య సంస్థలలో చురుకైన పాత్ర వహించారు.