పుట:Anandam Manishainavadu.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపాదకుని మాట

జీవితచరిత్రలు, ఆత్మకథలు సామాజిక చరిత్రను నిర్మించడంలో, ఒక ప్రాంతపు సంస్మృతిని అర్ధం చేసుకోవడంలో చాలా బాగా ఉపకరిస్తాయి. భవిష్యత్ తరాలవారు ఒక ప్రాంతం, కాలం ఆత్మను అవగాహన చేసుకోవాలంటే విశిష్టమైన వ్యక్తిత్వం, విస్తృతమైన కార్యరంగం ఉన్న వ్యక్తుల జీవితగాథలు అవసరం. ఉత్తమ ఉపాధ్యాయుడుగా, మంచి నాటక కళాకారుడిగా, విశిష్టమైన రచయితగా, అన్నింటికి మించి నిజాయితీ, నిబద్ధత, సమర్ధతలాంటి విలువలు కలిగిన వ్యక్తిగా మా నాన్నగారు - సూరంపూడి వెంకటరమణగారి జీవితం అలాంటి అధ్యయనానికి, అవగాహనకి పనికివస్తుందని నా నమ్మకం. నా నమ్మకానికి ఫలితమే ఈ పుస్తకం.

ఆయన షష్టిపూర్తికి ఓ పుస్తకాన్ని ప్రచురించాలని అనుకున్నప్పుడు సాధారణంగా షష్టిపూర్తులకు వేసే సావనీర్ వంటిది ప్రచురిద్దామని సన్నిహితులు, బంధువులు సలహాఇచ్చారు. అయితే ఆసక్తికరమైన సంఘటనలు, కాలగతిని పట్టి ఇచ్చే విశేషాలు. ఎందరికో స్ఫూర్తిదాయకం కాగల లక్షణాలు కలగలిసిన ఆయన జీవితాన్ని వ్యక్తీకరించడానికి అటువంటి సాధారణమైన ప్రయత్నాలు చాలదనిపించింది.

కరణీకం కులవృత్తిగా కలిగిన ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఆయన జీవితం ప్రారంభమైంది. చిన్నతనంలోనే తండ్రి మరణం, ఆస్తులు హరించుకుపోవడం, అన్నలు చేస్తున్న కరణీకం రెవెన్యూ సంస్కరణల పేరిట తొలగించడం, ఉమ్మడి కుటుంబ బాధ్యతలువంటివి ఆయన తొలినాళ్ల జీవితంలోనే ఎదురుకావడంతో కష్టాన్ని ఇష్టపడే మనిషి అయ్యారు. సినిమాథియేటర్‌లో ఈవినింగ్, సెకండ్ షోలకు టిక్కట్టు కౌంటర్‌లో పనిచేయడం, రోజుకు ఒక ఇడ్లీకోసం ట్యూషన్ చెప్పడం, ఆగ్రోన్ సంస్థలో ఎరువులు అమ్మడం మొదలుకొని ఎన్నో పనులు చదువుతూనే చేసారు. నిజాయితీగా సంపాదించు కొనేందుకు పనికివచ్చే ఏ వృత్తినైనా గౌరవించడం ఆయనకు అవి నేర్పాయి. అదే సమయంలో మా గ్రామం కంచుమర్రులో నాటకాలు వేసేందుకు కొందరు