పుట:Anandam Manishainavadu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చురుకైన మొద్దబ్బాయి

..నామాల మూర్తి

సినీ హాస్యనటుడు

హాస్యబ్రహ్మ జంధ్యాల రచించిన 'ఏక్‌దిన్ కా సుల్తాన్‌' నాటిక కడుపుబ్బ నవ్విస్తుంది. నా మిత్రుడు సూరంపూడి వెంకటరమణ ఆ నాటికలో టైటిల్ రోల్‌తో పాటు పెద్ద గుమాస్తాగా కూడా నటించేవారు. ఆయన డిగ్రీ చదువుతున్నప్పడు అప్పటి వారి లెక్చరర్, ప్రస్తుత హాస్యనటుడు బ్రహ్మానందం పర్యవేక్షణలో అత్తిలి కళాశాల వార్షికోత్సవంలో ప్రదర్శించారు. అప్పటికే రమణ నటన అంటే ఓ క్రేజ్ ఉండేది. ఏక్‌దిన్ కా సుల్తాన్‌లో హెడ్ గుమాస్తాగా వేదికపై నటిస్తుండగా కాఫీకప్పు తిరగేసి తాగుతున్నారు రమణ. ఇక చూస్కోండి కిందనుంచి ఈలలు రమణకు పొరపాటు అర్ధమైంది. ఏం చేయమంటారు బాబూ ఆఫీసర్ ముండావాడు నా ప్రాణం కుదురుంచడంలేదు. అందుచేత కాఫీ ఎలా తాగుతున్నానో నాకే తెలియడంలేదు అన్నారు. ఈ సమయస్ఫూర్తి విద్యార్ధులతో సహా లెక్చరర్లందరూ కరతాళధ్వనులు చేశారు. నాటిక అయ్యాక బ్రహ్మానందం ఆనందంతో రమణకు షేక్‌హ్యాండిచ్చారు. బ్రహ్మానందం దర్శకత్వంలో మొద్దబ్బాయి అనే ఏకపాత్ర చేసేవారు. మా గురువుగారు దర్శకులు, నటులు మల్లాది సూర్యనారాయణ నాతో రమణగారు చేసే ఏకపాత్ర చూడండి. అది మీకు ఉపయోగపడుతుంది అన్నారు. నేను ఏకపాత్ర చూసి మరికొంత అభివృద్ధిచేసి 'బండబ్బాయి' పేరుతో ప్రదర్శనలిచ్చాను. ఏకపాత్రాభినయ పోటీల్లో ఈ పాత్రకు నాకు వందలాది మొదటి బహుమతులు వచ్చాయి. నటుడు, దర్శకుడు హరగోపాల్ (ఆంధ్రాబ్యాంకు)తో కలసి 'ఈ మలుపు ఏవైపు' నాటిక గుంటూరు నాటక పోటీలలో ప్రదర్శించారు. ఇందులో బ్రహ్మానందం కూడా నటించారు. మా భూమి చిత్ర దర్శకుడు తిలక్ వద్ద సహాయ దర్శకునిగా పనిచేసిన వడ్డి రమేష్ ఈ నాటికకు దర్శకుడు. నేను అందులో రకరకాల భాషలు కలగలిపి మాట్లాడాను. దీనికి దుబాసీగా రమణను నటించమన్నారు. ఆయన అద్భుతరీతిలో అనువాదం చేసి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. ఇప్పటికీ ఈ దృశ్యం గుర్తుకువస్తే నాకు నవ్వొస్తుంది.