ఇక ఇకలు పోతే ఊరుకోను
అవి అత్తిలి మండలం స్కిన్నెరపురంలో రామలింగేశ్వరస్వామి కళ్యాణోత్సవాలు జరుగుతున్న రోజులు. ఆరోజు అత్తిలి లెక్చరర్ బ్రహ్మానందం (ప్రస్తుత ప్రముఖ సినీ హాస్యనటుడు) మిమిక్రీ ఏర్పాటు చేశారు. కంచుమర్రు, ఆరవల్లి, కోరుకొల్లు గ్రామాల ప్రజలుకూడా ఆ కార్యక్రమ్మానికి వచ్చారు. సభ కిటకిటలాడుతోంది. బ్రహ్మానందం మిమిక్రీ మొదలైంది. అయిదు నిముషాలు అయింది ఒక్కరూ నవ్వడంలేదు, పది నిముషాలైనా అదే పరిస్థితి. నవ్వొస్తోంది కాని గుప్పెట్లోమొఖం దాచుకొంటున్నారు. ఆయన వెంటే ఉన్న సూరంపూడి వెంకటరమణను బ్రహ్మానందం పిలిచారు. "ఇదేమిటి రమణా ఇన్ని జోకులు వేసినా ఒక్కరూ నవ్వరేమిటి? విషయం కనుక్కో" అన్నారు. జనంలోకి వెళ్ళి ఎందుకు మీరు నవ్వడంలేదు? అని అడిగితే సత్యంగారు (ఆవూరి పెద్ద, అనంతర కాలంలో జడ్. పి. చైర్మన్) ఇక ఇకలు పోవద్దన్నారు. వచ్చే ఆయన పెద్ద లెక్చరర్‌గారు పిచ్చ పిచ్చగా నవ్వితే ఊరుకోను అని మైక్‌లో చెప్పారట. అప్పటికి మిమిక్రీ అంటే అవగాహన లేకపోవడమే కారణం. అప్పుడు రమణ సత్యంగారి దగ్గరకు వెళ్ళి "ఇది నవ్వుకోవలసిన కార్యక్రమమండి కాస్త మీ వాళ్ళకు చెప్పండి" అని చెప్పారు. వెంటనే ఆయన వేదిక ఎక్కి "ఇది నవ్వుకొనేప్రోగ్రామ్‌అంటామీరు నవ్వుకోవచ్చు" అనడంతో నవ్వులు ప్రారంభమయ్యాయి. ఇక బ్రహ్మానందంగారు బ్రహ్మానందమే పొదారు.