Jump to content

పుట:Anandam Manishainavadu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అని విసుక్కుంటున్నారు. ఆ వ్యక్తి జనాన్ని తోసుకుంటూ ప్రదర్శన ప్రాంతానికి వచ్చేశాడు. ఒరే బాబా ఇక్కడున్నావా? అంతా ఎతుకుతున్నాన్రా! అంటూ కొడుకు పాత్రధారి చేతులు పట్టుకున్నాడు. అప్పటికి అందరికీ అర్దమైంది. జనాన్ని గెంటుకుంటూ వచ్చిన వ్యక్తి సూరంపూడి వెంకటరమణ మాస్టారని. అందరూ నవ్వుకుంటూ చప్పట్లుకొట్టారు. ఇంతకీ ఈ నాటికలో కొడుకు పెద్ద చదువులు చదువుతున్నానని మోసం చేస్తాడు. మోసపోయిన తండ్రి పాత్రలో చివర్న రమణ జనంచేత కంటతడి పెట్టించేవారు. ఇలా నాటికల్లో, లఘు హాస్యనాటిక (స్కిట్స్)ల్లో నటిస్తూ కడుపుబ్బ నవ్విస్తుంటారు. చిన్న పాత్ర అయినా, పెద్దదైనా సంభాషణ, ఆహార్యం వంటి విషయాల్లో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. మేము అక్షరదీక్ష, నిరంతర విద్యా కేంద్రాలు ఏర్పాటు సందర్భంగా గూడెం మండలంలో కళాయాత్రలు చేశాం. పగలంతా పాఠశాలలో కష్టపడి పనిచేయడం, రాత్రి 11:00 గం||ల వరకు గ్రామాల్లో ప్రదర్శనలివ్వడం, ఇలా ఈ యజ్ఞంలా మా ప్రదర్శనలు సాగేవి. దీనితోపాటు తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు వేదికలపై మేమిద్దరం వందలాది స్కిట్స్ ప్రదర్శించాం. అప్పటికప్పుడు స్కిట్ సిద్ధంచేయడం ఆయన ప్రత్యేకత. విమానాశ్రయ పాదచారుల సంఘం నెలవారీ కార్యక్రమాల్లో మా స్కిట్స్ ప్రదర్శనలు ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మా ఇద్దరిలో ఎవరు ఆ కార్యక్రమానికి వెళ్లకపోయినా ఆ సంస్థ సభ్యులు ఫోన్లుచేసి అడుగుతుంటారు. రమణ నన్ను బావగారూ అని ముద్దుగా పిలుస్తారు. నేనైతే బావగారు, అల్లుడుగారు అని పిలుస్తుంటాను. ఆయన పనిచేసిన పాఠశాలల్లో విద్యార్ధులను మంచి కళాకారులుగా తీర్చి దిద్దడం ఆయన ప్రత్యేకత. వార్షికోత్సవ కార్యక్రమాల్లో గ్రామ యువకుల్ని కూడా భాగస్వాముల్ని చేసి వారిచేత కూడా ప్రదర్శనలు ఇప్పించడం విశేషం. గణపవరం మండలంలో కూడా రమణ అక్షరదీక్ష కార్యక్రమాల్లో బాగంగా వీధి నాటికలు వేసి అక్షరాస్యత అభివృద్ధికి విశేష కృషిచేశారు.

  • వెంకటేశ్వరరావు చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రధారిగా రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలలో పేరు పొందిన నటులు. ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ చేసి రంగస్థలంపై నటిస్తూ కళాకారుల సంఘంలో కోశాధికారిగా సేవలందిస్తున్నారు.