పుట:Anandam Manishainavadu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆస్వాదిస్తూ చేయడంవల్ల కావచ్చు చాలా గొప్ప కళాకారుడు ఆయన. కళ కేవలం ప్రదర్శించేదే కాదు. నిత్యజీవితంలో ప్రతి అంశంలోనూ ఆయనకి కళాత్మకంగా జీవిస్తారు. తెలుగుపై ఎంత ప్రేమంటే ఆయన ఇల్లే తెలుగు లోగిళ్ళకు అసలైన అర్ధం అనిపిస్తుంది నాకు. ఆ ఇంట్లో వినిపించేది కనిపించేది అంతా తెలుగుదనమే.

చివరగా నాకు ఆయనలో ఆశ్చర్యం రేకెత్తించే విషయం ఏంటంటే పైన చెప్పినవన్నీ చేస్తూనే జీవితాన్ని నవ్వుతూ ఆస్వాదించడం. కష్టాల్లో, సమస్యల్లో, సమయం లేని సందర్భాల్లో కూడా తనను తాను సంతోషంగా ఉంచుకోగలగడం. పెద్ద పెద్ద హోదాల్లో పనిచేస్తూ, విపరీతంగా సంపాదించుకుంటూ కూడా తామేదో దారుణమైన కష్టం పడిపూతున్నాం అన్న భ్రమలో ఉండేవాళ్లనే ఎక్కువ చూస్తున్నాం. తను చేసే పనిలో ఉన్న స్ట్రెస్ కుటుంబం మీద చూపించి ఇంటిని నరకంగా మార్చుకునే వాళ్ళూ ఉన్నారు. కానీ నిజమైన కష్ట నిష్టూరాలు అనుభవిస్తూ అవకాశం ఉన్నా అవినీతి వైపు కన్నెత్తి చూడకుండా అత్యంత నియమబద్ధమైన జీవితం జీవిస్తూ కూడా మావయ్య అదేదో పెద్ద కష్టం అనుకోలేదు. రోజుకు ఇరవై, ముఫ్పై కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్ళినా ప్రయాణంలో ఆనందాలను ఆస్వాదించాడు. ఏ రోజూ సంతోషాన్ని చెరిగిపోనివ్వలేదు. ఉన్న కొంత సమయాన్ని, కాస్త డబ్బునీ, కొద్ది అవకాశాన్నీ జీవితం జీవించేందుకు, పక్కవారికీ సంతోషం పంచేందుకు ఉపయోగించాడు. కష్టాలు ఎదుర్కొనేటప్పుడు చిరునవ్వు నవ్వగలిగిన వాడినీ, తను నమ్మిన విలువల కోసం తనను తానూ గెలవగలిగిన వాడిని, ఏమున్నా ఏమి లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండగలిగిన వాడినీ హీరో అనొచ్చు అని ఒప్పుకుంటే మా మావయ్య మెగాస్టార్.


  • వ్యాసకర్త ఐ. సి. డబ్ల్యు. చదివి అక్కౌంట్స్, సాప్ట్‌వేర్ నిపుణునిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం విప్రోలో లీడ్ కన్సల్టెంట్ హోదాలో ఉన్నారు. శ్రీనివాసన్ వెంకటరమణ మేనల్లుడు. చిన్నతనం నుంచి ఆయనను దగ్గరగా చూసిన వ్యక్తి.