Jump to content

పుట:Anandam Manishainavadu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎప్పుడూ గుర్తుకురావు. సహాయం చెయ్యడం తన ధర్మమైతే చేసుకుపోయేవాడు.

అలాగే ఆయనకంటూ ఒక స్వంత సిద్ధాంతం, వ్యక్తిత్వం ఉన్నాయి. తండ్రిగా, భర్తగా, కొడుకుగా, బంధువుగా, బడి మాస్టారుగా, ఇప్పుడు విశ్రాంత ఉద్యోగిగా తన సిద్దాంతాన్ని అన్ని పాత్రలకూ, పరిస్థితులకు అన్వయించుకుని జీవిస్తాడు. ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు వేరైనా, పరిస్థితులు మారినా మారొచ్చుగాక ఆయన వ్యక్తిత్వం మాత్రం సమున్నతంగా నిలబడే ఉంది. అది నీళ్ళలా ఎందులో పోస్తే దానిలా మారేది కాదు, రాయిలా ఏం వచ్చినా చలించనిదీ కాదు. అది ప్రత్యేకం. ఆయన సిద్దాంతం/త్వాత్త్వికత వేలిముద్రలా అత్యంత విశిష్టం. గొప్ప నాయకులు, తత్త్వవేత్తలు, రచయితలూ, కళాకారులు మాత్రమే అలా జీవన తాత్త్వికత తయారు చేసుకో గలుగుతారు. మిగిలిన వారంతా అనుసరించి తీరాల్సిందే. సొంతంగా ఒక జీవన తాత్త్వికత కలిగిన ఆ కోవకే చెందినవాడు మా మావయ్య. పైగా నా సిద్ధాంతం ఇది అని ఎప్పుడూ ఎవరికీ చెప్పేవాడు కాదు. చేసుకుపోవడమే తప్ప నా జీవన వేదాంతం ఇది అని ఆయనకే తెలిదేమో. ఆయన ఆదర్శాలు నోటితో కాక చేతలతోనే చెప్పారు. జీవితాన్ని సరళంగా ఉంచుకోవడం, నిజాయితీని విడిచిపెట్టక పోవడం, ఎవరినీ బాధ పెట్టకపోవడం, తను ధర్మమని భావించింది. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా చేసి తీరడం లాంటివి కొన్ని లక్షణాలు.

రచ్చ గెలిచేవారు చాలామంది ఇంట గెలవలేరు. ఎందుకంటే బయట సమాజాన్ని, దూరంగా ఉండే బంధుమిత్రులు ప్రభావితం చేయడానికి వారి సమయం ఖర్చైపోగా పిల్లలతో మాట్లాడేందుకు కూడా సమయం ఉండదు. ఐతే మావయ్య ఇంట గెలిచాకే రచ్చ గెలిచాడు. ఆయన వ్యక్తిత్వం, నిబద్ధత తనతోనే మిగిలిపోలేదు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన పిల్లలు కూడా నిజమైన వారసులుగా తయారవ్వడం విశేషం. తాను ఎక్కడికి వెళ్ళినా పిల్లలను తనతోపాటుగా తీసుకువెళ్ళడం, తనకు తెలిసిన గొప్ప వ్యక్తులతో పరిచయం చేయడం లాంటివి చేయడంతో పిల్లలు కూడా ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఆణిముత్యాల్లా తయారయ్యారు. పైన చెప్పిన మిగిలిన అన్ని చేయవచ్చు కానీ ఈ పని చేయడం మాత్రం సాధారణమైన విషయం కాదు. గొప్ప గొప్ప