మా ఇంటి మెగాస్టారు - మా మంచి మాస్టారు
కలిగొట్ల వెంకట శ్రీనివాసన్
సమాజానికి కొన్ని కొలతలు, లెక్కలు మాత్రమే అర్ధమవుతాయి. ఒకడు గొప్ప యోగి అన్నామంటే జనం కాషాయ కమండలాలో, కనీసం కొల్లయో ఊహించుకొని ఇహ బంధాలు తెంచుకున్నాడు అన్నట్టు ఉహిహించుకుంటుంది. ఆయన ఒక ఫిలాసఫర్ అంటే పేజీలకు పేజీలు తత్త్వం గురించి రాస్తునో, ఉపన్యసాలు ఇస్తూనో ఉంటారని ఆశిస్తుంది. అలాగే హీరో అంటే ఒంటి చేత్తో వందమందిని మట్టి కరిపించడం గురించి ఊహిస్తారేమో. ఐతే అవేవి అవసరం లేదు. సంసారిగా ఉండి అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే కర్మయోగిగా నిలిచే వారున్నారు. తన చిన్ని జీవితాన్ని జీవించడంలో తనకంటూ కొన్ని సూత్రాలు నిర్మించుకొని లక్షల మంది జీవితాలకు దిశను నిర్దేశం చెయ్యగల ఫిలాసఫర్స్ ఉన్నారు. తను తిట్టినవాడిని తిరిగి చిన్నమాట అనకుండా చిరునవ్వుతో బదులిచ్చి మట్టి కరిపించిన హీరోలు ఉంటారు. నా జీవితంలో అత్యంత దగ్గరగా చూసిన యోగి, ఫిలాసఫర్, హీరో - మా మావయ్య సూరంపూడి వెంకటరమణ. నిజానికి ఆయన తన జీవితానికి ఓ ఫార్ములా తయారు చేసుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా దాన్ని అచ్చంగా అమలు చేసుకున్నారు. అలాగని జీవితాన్ని ఆస్వాదించడం మాననూలేదు. ఇదంతా ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుసుకుని, జెన్ ఫిలాసఫీ చదువుకుని తెచ్చిపెట్టుకున్నది కాదు. తనను తానూ అన్వేషించి దర్శించే మహర్షిలా తన జీవితాన్ని అనుభవించి తనదైన ఒక జీవన విధానాన్ని దర్శించారు. ఆ ఫార్ములా పూర్తిగా ఆయనలోంచి వచ్చినదే. ఆయన వ్యక్తిత్వం చూసి తెలుసుకుని కొన్ని అంశాలలో స్పూర్తి పొందిన చాలమందిలో నేనూ ఒకణ్ణి. ఆ విషయాలు పదిమందితో పంచుకుంటే మరికొందరికి ఉపయోగమని నమ్ముతూ ఈ వ్యాసం రాస్తున్నాను.
మావయ్య చిన్నతనం పూర్తిగా పేదరికంలో సాగింది. తండ్రి చనిపోతే అన్నయ్యలతో ఉమ్మడి కుటుంబంలో పెరిగాడు. చదువుకోవడమే కష్టమైన దశలో ట్యూషన్లు చెప్పుకుని చదివాడు. ఆ తర్వాత ప్రభుత్వోద్యోగం వచ్చి తన