పుట:Anandam Manishainavadu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ క్రమంలో వారితో పిల్లల చదువు తీరుతెన్నులు, పాఠశాల అభివృద్ధి విషయాలు చర్చించి తెలియకుండానే భాగస్వాములు చేసేసేవారు. పాఠశాలలో ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ఊళ్ళో యువత వచ్చి, రోడ్లు నిర్మించడం, స్టేజి తయారు చేయడం మొదలుకొని చివరగా కుర్చీలు సర్దడం వరకు సాయపడేవారు. వాళ్లతో నాటకాలు వేయించి ప్రోత్సహించేవారు. భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దు కోవాలనే విషయంపై సలహాలు, సూచనలు ఇచ్చేవారు. పాఠశాలను గ్రామానికి సన్నిహితం చేసేందుకు ఆయన వార్షికోత్సవాలను ఎంచుకున్నారు. ప్రతీ ఏటా స్కూల్లో జరిగే వార్షికోత్సవంలో విద్యార్ధుల ఆటపాటలతో పాటుగా విద్యా ప్రగతిని కూడా చూపించేవారు. ఒక బాధ్యతతో ఉపాధ్యాయులు తమ పిల్లల విద్యా ప్రగతి గురించి చెప్తూంటే, వారి అభివృద్ధి చూపిస్తూంటే ఆ నిజాయితీకి గ్రామస్థులు కరిగిపోయారు. ఆ వార్షికోత్సవాలకు వచ్చే అధికారులు, వీక్షించే గ్రామస్థులను ఒక తాటిమీదకు తెచ్చి పరిస్థితులు చెప్పి పాఠశాల అభివృద్ధి చెందేలా ప్రయత్నాలు చేసేవారు. పిల్లల వరకూ తీసుకుంటే ఆ వార్షికోత్సవం ఓ మహోత్సవం. టి. వి. లుఉన్న రోజుల్లో, రోజూ సీరియళ్లకు అలవాటు పడ్డ ప్రాణాలు అన్నట్టు ఐపోయినా వార్షికోత్సవాలు రాత్రి ఒంటిగంట వరకూ అవన్నీ వదిలి గ్రామమంతా చూసేవారు. పరీక్షలు పూర్తయ్యాక తమలోని ప్రతిభను బయటపెట్టే ఓ సువర్ణావకాశం. ఆత్మవిశ్వాసం లేక, పదిమందీ దిగదీసేయగా వెనుకబడ్డ విద్యార్ధులు వార్షికోత్సవాల హుషారులో బాగా ముందుకు రావడం నాకు తెలుసు. ఇదంతా మాష్టారి దూరదృష్టి ఫలితం. మాష్టారు గ్రామస్తుల్లో ఒకరిగా కలిసిపోయారు. ఆయన ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా వెళ్ళి పలకరించి ధైర్యం చెప్పేవారు. తనకు తోచినంతలో సలహాచెప్పి, వీలున్నంతలో తీర్చి మరీ వచ్చేవారు. అలా గ్రామంతో కలగలసి పోవడం భావి తరాలకు చెందిన ఉపాధ్యాయులు కూడా గుర్తించి, ఆచరించదగ్గ సూత్రం. అవన్నీ చూస్తే ఎడారిలో కూడా పువ్వులు పూయించగల వ్యక్తి అనిపిస్తుంది.

స్కూలు విషయంలో అపర భగీరధుడే : - పాఠశాలకు ఏం కావాలన్నది ఆలోచించడం, ఆ కావాల్సింది ఎంత కష్టమైనా ఏదోలా సాధించడం వంటి విషయాలలో ఆయన అపర భగీరధుడే అనిపిస్తుంది. గొల్లగూడెంలోని మా