పుట:Anandam Manishainavadu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లింగారాయుడుగూడెం గ్రామంలోని ప్రసాద్ (గణపతి) అనే మూగ పిల్లాడు ఒకడు. వాడికి రమణ మాస్టారు తోడిదే లోకం. ఆయన రానిరోజు వాడు ముసురు పట్టిన రోజులా ఉండేవాడు. ఆయన వస్తే పండగే. అలాంటి స్థితిలో ఆయన రిటైర్ అవ్వడం ఆ పసివాడి మనసులో పెద్ద ముల్లులా దిగింది. స్కూలుకు రావడం తగ్గించేశాడు. ఒకప్పుడు స్కూలుకు రాకపోవడమే ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు వాణ్ణి స్కూలుకు తీసుకురావడం సాధ్యమే కావట్లేదు. చివరకు మంచి పుష్టిగా ఉండే పిల్లాడు సన్నగా అయిపోయాడు. ఇలాంటి పిల్లలకోసం రిటైర్ అయ్యాకా కూడా కొన్నిసార్లు మాస్టారు బడికి వచ్చినా ఆ లోటు తీరలేదు. అంత ప్రేమకు కారణం ఆయన సుమధురమైన వ్యక్తిత్వమే. ఆయనకు పనిచేసిన స్కూల్లోని పిల్లలే సర్వస్వంగా గడిపారు. ఆయన స్థానం ఎంత ప్రత్యేకం అంటే ఆయన పనిచేసిన పాఠశాలల్లో హెడ్మాస్టరుగా వేరేవాళ్ళు వచ్చినా ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోయినా పిల్లలు ఆయననే "హెడ్మాస్టారు" అని పిలుస్తారు. ఎందరైనా మాస్టార్లు రావచ్చు గానీ పిల్లల మనసులో హెడ్మాస్టారు స్థానం ఆయనదే. ఆయన రిటైర్ అయ్యారని తెలియక కాదు తెలిసినా వాళ్లకు తేడా ఏమీ కనబడదు.

సృజనాత్మకత, సమర్ధతల కలయిక : - అప్పటికే మాస్టారు దాతల సహకారంతో కుర్చీలు ఏర్పాటు చేసిన విషయం అధికారులు దృష్టిలో పెట్టుకొని కొత్తగా స్కూలుకు పర్మినెంటు సిమెంటు జారుడుబల్లలు వంటికి తక్కువ ఖర్చులో సమకూర్చే చైల్ద్ ఫ్రెండ్లీ స్కూల్ పథకానికి గొల్లగూడెం పాఠశాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. దాన్ని ఛాలెంజ్‌గా స్వీకరించిన మా హెడ్మాష్టారు, మేము ప్రణాళికాబద్ధంగా పని మొదలుపెట్టాము. కొమ్ముగూడెం సొసైటీ అధ్యక్షుడు కీ. శే. వట్టికూటి గుర్రాజును సంప్రదించగా ఆయన ఐదువేలు సొసైటీ తరుపున ఇచ్చారు. నేనూ, హెడ్మాష్టారు రమణగారు సాయంత్రాలు ఎక్కువసేపు ఉండి మేస్త్రితో చర్చించి పనులు చేయిస్తూంటే సర్పంచి కోరశిఖ హరనాథ్ స్పందించారు. "మీరే ఇంతగా మా పిల్లల కోసం తాపత్రయ పడుతూంటే మేము మీకు సాయం చేయాలి కదా" అంటూ మిగతా ఖర్చులు భరించి మొత్తం 15 వేలతో నిర్మించారు. ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ సిమెంటు అవసరమైన పాళ్లలోనూ, పని పక్కాగానూ చేసేలా కృషిచేశారు.