చివరకు అతనే చదువుతానని మాష్టారి దగ్గర ఒప్పుకున్నాడు. అతనితో మిగిలిన క్లాసులు చదువుకూడా పూర్తిచేయించి క్రమేణా పదో తరగతి ప్రైవేటుగా కట్టించారు. పట్టుదల, కృషి ఆ పాఠాల మీద పెట్టిన నారాయణమూర్తి చివరకు పరీక్షల్లో పాసయ్యాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మాధవరం ప్రభుత్వ కళాశాలలో చేర్పించి చదివించబోతే అతను మళ్ళీ చదవలేకపోయాడు. నేను ఆపైన మెకానిక్ షాపులో చేర్చాను. మెకానిక్ వర్కు వేగంగా నేర్చుకున్న అతను విదేశాలకు వెళ్ళి అక్కడ పనిచేస్తూ సంపాదించుకుంటూ తన కాళ్లమీద నిలబడ్డాడు. అలా మాస్టారు తనను తాను అంగవికలునిగా భావించిన కుర్రాడిలో ఆత్మ విశ్వాసాన్ని నింపి, చదివించి ఓ స్థాయికి చేర్చారు. ఇప్పటికి అతన్ని కొన్నేళ్ళ క్రితం చూసినవారికి ఎవరికైనా ఇది గొప్ప ఆశ్చర్యమే. ఇది ఆయన 30 ఏళ్ళ సర్వీసులోనూ, మా 14 ఏళ్ళ సాన్నిహిత్యంలోనూ ఒక సంఘటన మాత్రమే. ఇటువంటి ఎందరో విద్యార్ధుల జీవితాలను మార్చిన వ్యక్తి ఆయన.
దూరదృష్టిగల దిక్చూచి : - రమణమాష్టారి ఆలోచనలు, అభివృద్ధి ఇతర పాఠశాలలు, ప్రభుత్వం అమలు చేయడానికి ఎన్నో సంవత్సరాల ముందే కార్యరూపంలోకి తీసుకు వచ్చేవారు. గొల్లగూడెం పాఠాశాలలో (2000 నుంచి నాలుగైదేళ్ళు మేమిద్దరం ఆ పాఠశాలలో పనిచేశాం) కొందరు దాతల సహాయం తీసుకొని బేబీ చైర్స్ (చిన్న పిల్లల సైజుకు సరిపోయే కుర్చీలు) కొనిపెట్టారు. ఆ కుర్చీలకు ముందు భూమికి అర అడుగు ఎత్తులో ఉండే బల్లలు ఉండేవి. ఒక్కసారిగా రంగురంగుల కుర్చీలు వచ్చేసరికి పిల్లల సంబరం చెప్పనలవి కాదు. అప్పటి దాకా ఆలస్యంగా వచ్చేవాళ్ళు. స్కూలుకి రావడం మానేసినవాళ్ళూ రావడం మొదలుపెట్టారు. బడికి దూరంగా ఉన్న పిల్లలు కూడా వచ్చి బడిలో చేరడం మొదలుపెట్టారు. దాంతో కొంతమంది పిల్లలకు కుర్చీలు సరిపోయేవి కాదు. ఓ ఐదు, పది మందికి తక్కువయ్యేది. మాస్టారితో "వేరే దాతను అడిగి అందరికీ సరిపోయేలా కొందాం" అని చెప్పాను. ఐతే మాస్టారు మాత్రం అలా వద్దని పిల్లలందరికీ ఎవరు ముందు వస్తే వారికే కుర్చీలు అని చెప్పారు. దాంతో రోజూ కుర్చీల కోసం, కావలసిన రంగు కుర్చీల కోసం చాలామంది అందరికన్నా ముందు వచ్చేసేవారు. ఆఖరున వచ్చి కొద్దిమంది బల్లలమీద కూర్చుంటే మరుసటి రోజు వాళ్ళే ముందు
10