Jump to content

పుట:Anandam Manishainavadu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రామస్తులు, యువకులు వెక్కిరింతగా "తిన్నావా ఊరిమీద పడ్డావు" అంటూ అవమానకరంగా మాట్లాడేవారు. అతని పేరుతో పిలవడం మాని వైకల్యాన్ని వెక్కిరించేవారు.

మా హెడ్‌మాష్టారు రమణగారికి ఈ విషయంపై కొంత అనుమానం ఉండేది. అతను నడవగలడేమో బహుశా ఆత్మవిశ్వాసం లేక నడవడం లేదేమోనని. అతనితో మెల్లిగా పరిచయం పెంచుకుని ఓ రోజు ఆ స్టాండ్ పక్కకి తీసేసి నడవమన్నారు. మొదట అతను కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉండిపోయాడు. స్టాండ్ లేకుండా నేను నడవలేనండీ అంటూ వారించాడు. మాస్టారు మాత్రం నీకు పోలియో లాంటీ వ్యాధి ఏమీ రాలేదు, జరిగిన యాక్సిడెంట్ తాలూకు దెబ్బలు తగ్గాయి. మరేమిటీ నీ భయం. నడచి చూడవోయ్ పడిపోకుండా మేమంతా ఉన్నామని ధైర్యం చెప్పారు. ఆశ్చర్యకరంగా అతను నడిచి కొద్ది తప్పటడుగులు వేసి ఆపైన సాధారణంగానే నడిచేశాడు. ఊరందరికే కాదు ఈ పరిణామం అతనికే ఆశ్చర్యమయ్యింది. మాస్టారిపై నమ్మకం పెంచుకున్నాడు.

ఆపైన మాస్టారు అతనిని చదివిద్దాం అనుకున్నారు. నాలుగో తరగతిలోనే చదువు మానేసి పదిహేడేళ్ళ వయస్సు వచ్చేశాక ఇంకేం చదువు అని అతను ఆ ప్రయత్నాలకు ఒప్పుకునేవాడు కాదు. అతన్ని స్కూలుకు వచ్చి సరదాగా పిల్లలతో మాట్లాడుతూండమని చెప్పారు. తీరా స్కూలుకు వచ్చాకా రెండు, మూడు తరగతుల చదువు పునశ్చరణ (రివిజన్) చేయించేశారు. ఆ క్రమంలో అతను స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్‌డే వంటి కార్యక్రమాల ఏర్పాట్లలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. మా పాఠాశాలలో ప్రతి ఏటా నిర్వహించే వార్షికోత్సవాలలో నాటకాలు, డాన్స్‌లు వేసేవాడు. ఇంకుడు కుండీల తవ్వకం, మొక్కల పెంపకం, ఆటలు వంటి ఏ కార్యక్రమమైనా ముందే ఉండేవాడు. నారాయణమూర్తిని అంతకుముందు చూసినవారంతా ఆశ్చర్యపడుతూ మాట్లాడితే అతని ఆత్మవిశ్వాసం పెరిగింది.

9