Jump to content

పుట:Anandam Manishainavadu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇటుపక్క వీళ్ళు కళ్ళనీళ్ళ పర్యంతం కావడమూ, అటుపక్క ఆయన సముదాయించి వచ్చేస్తానని ధైర్యం చెప్పడమూ గొప్ప దృశ్యమది. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన స్కూలుకు వచ్చేసరికి పట్టరాని ఆనందంతో చెంగు చెంగున దూకే లేడి పిల్లల్లా, తవ్వాయిల్లా స్కూలంతా ఓ బృందావనం అయిపోయింది. ఆయన పిల్లలకి చదువు చెప్పే తీరులోనే ఆ ఆకర్షణ ఉంది. ఎంతో ప్రేమగా, అభిమానంగా ఆయన వ్యవహరించే తీరుకు పిల్లలంతా అభిమానంతో ఉండేవారు. భయంతో చదివించలేక పోవచ్చుకానీ ప్రేమతో, ఉత్సాహంతో చదివించలేనిది ఉండదన్నదే ఆయన సిద్దాంతం.

పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం మండలంలోని గొల్లగూడెం, లింగారాయుడుగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠాశాలల్లో ఆయన హెడ్మాస్టరుగా పనిచేసిన స్కూళ్ళలో నేను ఆయన వద్ద అసిస్టెంట్‌గా పనిచేసాను. ఆయన చాన్నాళ్ళు నిత్యం నా బండిమీదే స్కూలు వచ్చి పోయేవారు. దానితో ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నాను. ఇలాంటి ఎన్నెన్నో అపురూపమైన దృశ్యాలు చూడగలిగాను. మేము కొలీగ్స్ అయినా మా మధ్య ఉన్నది గురుశిష్య సంబంధం. టిటిసి పూర్తిచేసి 2000 సంవత్సరంలో మా స్వస్థలం శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాన్ని వదిలిపెట్టి తాడేపల్లిగూడెం ప్రాంతానికి ఉద్యోగంపై వచ్చిననాడు ప్రారంభమైన మా బంధం అపురూపమైనది.

దార్శనికుడు : - తాడేపల్లిపల్లిగూడెం మండలంలోని లింగారాయుడుగూడెం పాఠశాలలో పనిచేసేటప్పుడు ఓ కుర్రాడు ఊళ్ళో ఖాళీగా తిరిగేవాడు. అతని పేరు నారాయణమూర్తి. ఎప్పుడూ నాలుగు కాళ్ళ స్టాండ్ పట్టుకునే నడిచేవాడు. ఎప్పుడో చిన్నతనంలో అతనికి యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలాయి. కొన్నాళ్ళపాటు వాడేందుకు ఆ స్టాండ్ ఇచ్చారు డాక్టర్. అతనికి మాత్రం తాను వికాలాంగుణ్ణి అయిపోయానన్న భయం పట్టుకుంది. మానసికంగా ఈ విషయం గట్టిగా నమ్మడం, అలానే నాలుగు కాళ్ళ స్టాండ్ సాయంతో తిరగడంతో అలా ఊళ్ళోకూడా వికలాంగుడనే నమ్మేవారు. అతనికి మానసికంగా కాళ్ళపై పట్టుకోల్పోయినట్టు అయింది. ఈ వ్యధలో అతను చదువు వదిలి పెట్టేశాడు. ఇదంతా నేను, మాస్టారు ఆ ఊరి పాఠశాలకు రావడానికి ఎన్నో ఏళ్ళ ముందు జరిగింది. మాష్టారు పాఠశాలకు వచ్చేసరికి ఆ అబ్బాయి ఎక్కడ కనిపించినా

8