సామాజిక బాధ్యతగా నిరక్షరాస్యత నిర్మూలనకై పరితపించి అక్షరదీక్ష, అక్షరగోదావరి, అక్షర మహిళ కార్యక్రమాలకు తనవంతు సేవలందించారు. సామాన్య జనానికి అర్దమయ్యేరీతిలో వీధి నాటకాలను రూపొందించి, నటించి ప్రదర్శించారు. నిరంతర విద్యా కేంద్రాల వ్యాప్తికి ప్రచార బాధ్యతను భుజాన వేసుకొని ఎన్నో కళా ప్రదర్శనలకు దర్శకునిగా, వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
సాహితీ సేవలో భాగంగా, ఎన్నో అవధాన కార్యక్రమాలలో "అప్రస్తుత ప్రసంగంచేసి ప్రేక్షకుల కరతాళధ్వనులందుకున్నారు. సాహితీ సమాఖ్య సభ్యునిగా, కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా, అధ్యక్షునిగా విశేష సేవలందించారు. సంక్షోభ సమయంలో సమాఖ్య కార్యక్రమాలకు ఆటంకం లేకుండా ముందుకు నడిపించారు. ఎందరో ప్రముఖ సాహితీవేత్తలను రప్పించి వారి అద్భుతమైన ప్రసంగాలద్వారా శ్రోతలను ఆనందింపజేయడంతో పాటు, వారికి ఘన సత్కారాలు చేశారు. భావితరాలకు భాషపట్ల, సంస్కృతిపట్ల, సాహిత్యంపట్ల అనురక్తిని కలిగించారు. ఆంధ్ర పద్యకవితా సదస్సు ఉపాధ్యక్షునిగా కంఠస్థ పద్యపోటీలు, వ్యాసరచన పోటీలు దిగ్విజయంగా నిర్వహించి విద్యార్థులకు దాతల సహకారంతో చక్కని బహుమతులందించారు. నన్నయభట్టారక పీఠం, ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సేవా సంస్థలలో వివిధ హోదాలలో తమ సేవలందించారు. వారి రేడియో కథానిక 'కనువిప్పు', మినీ కవితల వికాసం వ్యాసం రచించి వినిపించగా ఆకాశవాణి, విజయవాడ కేంద్రంలో ప్రసారమైంది. పత్రికా సంపాదకునిగా, మధుమంజరి సాహిత్య పత్రికకు ఏడాదిపాటు సేవలందించారు. రేడియోలో కవితలు ప్రసారమయ్యాయి. వీరి రచనలు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీరి రచన 'ఎవడిగోలవాడిది' హాస్యనాటిక పలు ప్రదర్శనలిచ్చారు. బి.వి.ఆర్. కళాకేంద్రం నాటక కళాపరిషత్ నిర్వహణ కమిటీ సలహాదారుగా సేవలందిస్తున్నారు. తెలుగు భాషా ప్రాచీన హోదా కల్పించుటలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో పాల్గొని 62 తాళపత్ర గ్రంథాలను వెలుగులోనికి తీసుకొచ్చారు. పెంటపాడు మండల సమన్వయకర్తగా తమ సేవలందించారు.
2