పుట:Anandam Manishainavadu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిపూర్ణ జీవితం - బహుముఖ ప్రతిభ

...బుద్దాల వెంకట రామారావు,

కళాపోషకులు,

బి. వి. ఆర్. కళాకేంద్రం వ్యవస్థాపకులు

సాంప్రదాయ కుటుంబంలో రమణ మాస్టారు జయనామ సంవత్సరము బహుళ అష్టమి నాడు కీ॥ శే॥ సావిత్రమ్మ, పట్టాభిరామయ్య పుణ్య దంపతులుకు అత్తిలి మండలం కంచుమర్రు గ్రామంలో జన్మించారు. కంచుమర్రులో ప్ర్రాథమిక విద్య, మంచిలి, కోరుకొల్లు పాఠశాలల్లో మాధ్యమిక విద్య, అత్తిలి డిగ్రీ కళాశాలలో ఇంటర్, డిగ్రీ విద్యనభ్యసించారు. మచిలీపట్నంలో బి.ఇడి.ని పూర్తిచేశారు. తదనంతరం 1977లో పాత్రికేయ వృత్తిలో ప్రవేశించి 1980-81 మధ్యకాలంలో ఈనాడు సబ్ ఎడిటర్‌గా ఈనాడు దినపత్రికలో విజయవాడలో పనిచేశారు. 1983వ సం॥లో ఆగష్టులో బల్లిపాడులో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించేవరకు పాత్రికేయ వృత్తిని పూర్తిస్థాయిలో కొనసాగించారు.

విద్యార్ది దశలోనే కళారంగంపట్ల అనురక్తిని, ఆసక్తిని పెంచుకొని 10 ఏళ్ళ చిరు ప్రాయంలోనే అనేక సాంఘిక నాటికలకు దర్శకత్వం వహించడమేగాక, నటించారు. అంతేకాక అల్లూరి సీతారామరాజు వంటి చారిత్రక నాటకాలు, లక్ష్మమ్మ కథ, బాలనాగమ్మ వంటి జానపద , భక్త కన్నప్ప, సింహాచల క్షేత్రమహిమ వంటి పౌరాణిక నాటకాలలో నటించారు. "మొద్దబ్బాయి"గా సాంఘిక నాటికలో వందలకొద్దీ ప్రదర్శనలలో నటించి మెప్పించారు. ఆయన శిక్షణలో విద్యార్దులు, మూడు బృందాలుగా పరమానందయ్య శిష్యులు హాస్యనాటకాన్ని ప్రదర్శించారు. సందర్భోచితంగా ఎన్నో వేదికలమీద అప్పటికప్పుడు హాస్య లఘునాటికలను రచించి, ప్రదర్శించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. దూరదర్శన్, చలన చిత్ర రంగాలలో వారు ప్రాతినిధ్యం వహించి మన్య విప్లవం నాటికలో పిళ్ళైపాత్రను అద్భుతంగా పోషించారు. 'అల్లుడుపోరు అమ్మాయిజోరు' చిత్రంలో నటించి మెప్పించారు.

1